16 ఏళ్ల అమ్మాయిని తండ్రి కొడుకులు వాడుకొని వదిలేశారు

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. తండ్రి, కొడుకులు చేసిన అఘాయిత్యానికి బాలిక బలైంది. యావత్తు సమాజం తలదించుకునేలా చేసిన సంఘటన నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశమైంది. అసలు వివరాలు ఏంటంటే..

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తిరుమలగిరి లో దారుణం జరిగింది. తిరుమలగిరికి చెందిన భూతం శ్రీను వ్యవసాయం చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలిక శ్రీను బావి దగ్గరకు పనులకు వచ్చేది. బాలిక 8 వ తరగతి వరకు చదువుకొని చదువు ఆపేసింది. కూలీ పనులకు వెళుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటోంది. గ్రామంలో పత్తి, వరి కోత పనులకు బాలిక వెళ్తుండేది. శ్రీను బావి దగ్గరకు కూడా పలుమార్లు వెళ్లేది. గ్రామానికి చెందిన వ్యక్తే కావడంతో చిన్న చిన్న పనులకు కూడా బాలిక వెళ్లేది. ఆ క్రమంలోనే శ్రీను కన్ను బాలిక పై పడింది. అలా ఆ బాలికకు డబ్బు, ఇతర ఆశలు చూపి లోబర్చుకున్నాడు.

గత సంవత్సరం నుంచి బాలిక పై బావి దగ్గర పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీను బావి దగ్గరికి రాని సమయంలో శ్రీను కొడుకు వచ్చేవాడు. ఓ సారి శ్రీను బావి దగ్గర బాలికతో కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు శ్రీను కొడుకు చూశాడు. శ్రీను బావి దగ్గర లేనప్పుడు ఆ బాలికను శ్రీను కొడుకు బెదిరించి లొంగదీసుకున్నాడు. అలా గత కొంత కాలంగా తండ్రి కొడుకులు  ఇద్దరు కూడా బాలిక పై అత్యాచారం చేస్తున్నారు.

బాలిక మృతదేహంతో ఇంటి ముందు ధర్నా చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

గురువారం బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు బాలికను దేవరకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక 7 నెలల గర్భవతి అని తేల్చారు. బాలిక కుటుంబ సభ్యులు వచ్చి శ్రీనును నిలదీయగా అబార్షన్ చేయించుకోవాలని 5 వేల రూపాయలు ఇచ్చాడు. దీంతో వారు మళ్లీ దేవరకొండ ఆస్పత్రికి వెళ్లి అబార్షన్ చేయాలని కోరగా అందుకు డాక్టర్లు నిరాకరించారు. ఏం చేసినా తల్లి, బిడ్డలకు ప్రమాదం అని తేల్చారు. దీంతో చేసేదేం లేక గ్రామానికి వచ్చారు.

బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీను ఇంటికి వెళ్లి తనకు న్యాయం చేయాలని నిలదీసింది. దీంతో శ్రీను కుటుంబ సభ్యులు తమకు అసలు ఎలాంటి సంబంధం లేదని అసలు ఎవరు నువ్వు అంటూ మాట్లాడారు. అవమానంగా భావించిన బాలిక శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. గమనించిన చుట్టు పక్కవారు బాలికను నల్లగొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

శనివారం ఉదయం బాలిక శవాన్ని తీసుకొని శ్రీను ఇంటికి చేరుకొని బాలిక కుటుబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. అప్పటికే శ్రీను కుటుంబ సభ్యులు ఇంటికి తాళం పెట్టి పారిపోయారు. దీంతో వారు శవాన్ని అక్కడే ఉంచి ఆందోళన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని వారితో చర్చించారు. అయినా కూడా వారు ఆందోళన విరమించలేదు. పెద్ద మనుషులు శ్రీనును తీసుకొచ్చి వారికి నష్టపరిహారం హామీ ఇప్పిస్తామని, శ్రీను పై కేసు కూడా నమోదు చేపిస్తామని వారు హామీనిచ్చారు. ఏదేమైనా సరే ఇక్కడికి వచ్చి చెప్పాలని లేనిదే తాము ఆందోళన విరమించమని వారు తెలిపారు. శ్రీను పై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.  ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.