మేడ్చల్ జిల్లాలో విషాదం జరిగింది. కీసర మండలం రాంపల్లి వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం పనుల్లో శ్లాబ్ కూలీ ఆరుగురు కూలీలు ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
రాంపల్లివద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరుగుతోంది. మద్యాహ్నం సమయంలో ఆకస్మాత్తుగా ఐదంస్థుల ఎత్తు నుంచి ఆరుగురు కూలీలు కిందపడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యెషు కుమార్ చౌదరి(20), సుపాల్‌రాయ్(32), సైపుల్ హక్(26), అభిజిత్‌రాయ్(18), ఇలాన్ షేక్(20) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా.. విప్లవ్‌రాయ్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలవడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలీలు మృతి చెందడంతో మిగతా కూలీలు ఆగ్రహంతో బిల్డింగ్ నిర్మాణ ఆఫీసులో అద్దాలను, ఫర్నీచర్ ను ద్వంసం చేసి ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కూలీలకు నష్టపరిహారం చెల్లిస్తామని కాంట్రాక్టర్ హామీనిచ్చారు. దీంతో వారు శాంతించారు. కానీ అక్కడ విషాదచాయలు అలుముకున్నాయి.