కొన్ని సందర్భాల్లో వైద్యుల చేసిన చికిత్స వికటించి రోగుల స్వస్థతకు గురైన సంఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా ఇబ్రహీంపట్నంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ చేయించుకున్న మహిళ అస్వస్థతకు గురై మరణించగా మరో ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడం వల్లే మహిళ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.
వివరాలలోకి వెళితే… ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో ఆగస్టు 25వ తేదీన డివిజన్లో ఉన్న 34 మంది మహిళలకు డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలో మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, మంచాల మండలం లింగంపల్లి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నంలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్లిన అనంతరం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సుష్మ అనే మహిళ ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. లావణ్య అని మహిళ ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నర్సాయిపల్లికి చెందిన మమత(32) బీఎన్‌రెడ్డి సమీపంలోని బృంగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. దీంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడంతోనే ఆమె మరణించిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం డిప్యూటీ డీఎంహెచ్‌వో వివరణ కోరగా..ఆపరేషన్లతో ఎలాంటి ఇబ్బందులూ రాలేదని, ఆగష్టు 25 వ తేదీ 34 మందికి ఆపరేషన్లు చేసి ఆరోగ్యపరిస్థితులను పరిశీలించాకే ఇంటికి పంపించామని డాక్టర్లు తెలిపారు. అస్వస్థతకు గురైన ఆ ముగ్గురు మహిళలూ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.