తూ.గో.లో చిన్నారులకు కల్తీ పాలు, సీపీడీఓ ఆత్మహత్యాయత్నం

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కల్తీ పాలు తాగి అస్వస్థత పాలయ్యారు 10 మంది చిన్నారులు. చేసిన తప్పును నిలదీసినందుకు అధికారిణిపై బెదిరింపుకు పాల్పడ్డాడు కాంట్రాక్టర్. అతగాడి బెదిరింపుకు భయపడి అధికారిణి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల్లో రోజూ ఉదయం బాలింతలకు, చిన్నారులకు పాలు, గుడ్లు మొదలైన పౌష్టికాహారం అందిస్తుంది. ఈ కేంద్రాల్లో ప్రతి రోజూ చిన్న పిల్లలకి మధ్యాహ్నం 12 గం.లకు భోజనం, తిరిగి మధ్యాహ్నం 2 గం.లకు ఉడకబెట్టిన శనగలు ఇస్తుంటారు. అయితే బలహీనంగా ఉన్న చిన్నారులకు ప్రతిరోజూ 200 మి.లీ పాలు ఇవ్వడం జరుగుతుంది.

తూర్పు గోదావరి జిల్లా ఏజీ కోడూరు మండలంలో అంగన్ వాడి కేంద్రంలో 12 రోజుల క్రితం పాలు తాగి పదిమంది చిన్నారులు అస్వస్థత పాలయ్యారు. పాలలో కల్తీ జరిగిందని భావించిన అంగన్ వాడి కేంద్రాలను పర్యవేక్షించే అధికారిణి గీత కాంట్రాక్టరుని నిలదీసింది. చేసిన తప్పుకి పశ్చాత్తాప పడకపోగా ఆ కాంట్రాక్టరు అధికారిణి గీతపై బెదిరింపు చర్యకు పాల్పడ్డాడు.

పాలు సరఫరా చేసిన వారిని వదిలేసి అంగన్ వాడి వర్కర్, సూపర్ వైజర్, సీపీడీఓ గీతకి షోకాజ్ నోటీసులు పంపారు అధికారులు. సూపర్ వైజర్ ని సస్పెండ్ కూడా చేశారు. దీంతో మనస్థాపానికి గురైన గీత పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఆమెను గొల్లపూడి ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీత పరిస్థితి విషమంగా ఉంది. 48 గంటలు దాటితే కానీ పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్టు గీత భర్త తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.