పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్ సభ స్ధానానికి గోకరాజు గంగరాజు పోటీ చేయనున్నారా ? అవుననే అంటున్నాయి వైసిపి వర్గాలు. గోకరాజు గంగరాజు ప్రస్తుతం బిజెపి ఎంపి గోకరాజు రంగరాజు కొడుకు. రాబోయే ఎన్నికల్లో రంగరాజు పోటీ నుండి తప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదెంత వరకూ నిజమో తెలీదు కానీ గంగరాజు వైసిపిలో చేరటం మాత్రం ఖాయమనే సమాచారం.
నిజానికి నరసాపురం పార్లమెంటు స్ధానంలో పోటీ చేయటానికి వైసిపికి బలమైన అభ్యర్ధి లేరనే చెప్పాలి. మంచి అభ్యర్ధి కోసం జగన్మోహన్ రెడ్డి చాలా పేర్లనే పరిశీలించినప్పటికీ సాటిస్ఫై కాలేదట. ఈ నేపధ్యంలోనే గోకరాజు గంగరాజు పేరు పరిశీలనలోకి వచ్చింది. గంగరాజుకున్న కుటుంబ నేపధ్యం, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న బంధుత్వాలు, ఆర్దిక, అంగ బలం పుష్కలంగా ఉన్న కారణంగా జగన్ కూడా గంగరాజును అభ్యర్ధిగా దాదాపు ఖాయం చేశారని తెలిసింది. లోటస్ పాండ్ లో జగన్ తో గోకరాజు భేటీ అవుతున్నట్లు సమాచారం.
ఈమధ్యనే టిడిపిలో చేరిన రఘురామ కృష్ణమరాజుకు గంగరాజు దగ్గర బంధువవుతారు. అలాగే మాజీ ఎంపి కనుమూరి బాపిరాజు కూడా దగ్గర బంధువే. బాపిరాజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పోటీ అనేది పెద్దగా ఉండదని తెలిసిందే. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే కృష్ణమరాజు తెలుగుదేశంపార్టీలో చేరారు. టికెట్ విషయంలో హామీ తీసుకునే కృష్ణమరాజు టిడిపిలో చేరారటలేండి.
కాబట్టి కృష్ణమరాజుకు టికెట్ ఇవ్వటంలో చంద్రబాబుకు పెద్దగా అభ్యంతరాలుండకపోవచ్చు. అంటే రేపటి నరసాపురం లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైసిపి తరపున గోకరాజు గంగరాజుకి టిడిపి అభ్యర్ధి రఘురామ కృష్ణమరాజు మధ్యే ఉంటుందనటంలో సందేహం లేదు. సరే ఎవరు గెలిచినా ఎంపి పదవైతే బంధువుల్లోనే ఉంటుందనుకోండి అది వేరే సంగతి.