గుండెపోటు వచ్చినా తణుకు బస్సు డ్రైవర్ 36 మందిని ఎలా కాపాడారంటే

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా ఎక్కువయ్యాయి. అతి వేగం కారణంగా కొందరు బలవుతుంటే… మద్యం మత్తులో కొన్ని యాక్సిడెంట్లు చోటు చేసుకుంటున్నాయి. రోజులు బాలేకపోతే ఒక్కోసారి జాగ్రత్తగా వెళుతున్నా ప్రమాదాలు పెనుభూతంలా వెంటాడుతున్నాయి. తెలంగాణాలో కొండగట్టు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 67 మంది అసువులు బాసారు. యావత్ భారతదేశంలోనే అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం అది. ఈ ఘటన తర్వాత జనం బస్సు ఎక్కాలంటేనే భయపడ్డారు. అయితే ఏపీలో ప్రాణాల మీదకు వచ్చినా ఆర్టీసీ బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న 36 మంది ప్రాణాలకు హాని కలగకుండా వ్యవహరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింద ఉన్నాయి చూడండి.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుండి హైదరాబాద్ బిహెచ్ఈఎల్ బయలుదేరింది ఒక ఆర్టీసీ బస్సు. ఆ బస్సులో తణుకు డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు ఏ.అన్నవరం, పి.శేఖర్ ఉన్నారు. శనివారం రాత్రి తణుకు నుండి హైదరాబాద్ బిహెచ్ఈఎల్ వెళ్లే సర్వీసు నెంబర్ 4971 బస్సులో వీరి డ్యూటీ. 36 మంది ప్రయాణికులతో బస్సు తణుకు నుండి బయలుదేరింది. బస్సును డ్రైవర్ అన్నవరం నడుపుతున్నాడు. ఆయన వయస్సు 61 సంవత్సరాలుగా తెలుస్తోంది. అయితే బస్సు నడుపుతున్న అన్నవరానికి సడెన్ గా గుండె పోతూ వచ్చింది. రాత్రి 9:30 సమయంలో బస్సు తాడేపల్లిగూడెం దాటింది. ఆకాశముట్టుగా అన్నవరానికి గుండెలో నొప్పి మొదలయ్యింది. అతి కష్టం మీద వేగాన్ని అదుపు చేసి బస్సును సేఫ్ గా పక్కన నిలిపాడు.

ఆ తర్వాత అన్నవరం కళ్ళు తిరిగి పడిపోయాడు. బస్సులో ఉన్న తోటి డ్రైవర్, ప్రయాణికులు తనకి సపర్యలు చేసిన తర్వాత కొద్దిగా కోలుకున్నాడు. ఆ తర్వాత డ్రైవర్ శేఖర్, ప్రయాణికులు కలిసి రాత్రి 10:30 కి డ్రైవర్ అన్నవరంను ఏలూరు జిల్లా హాస్పిటల్ లో జాయిన్ చేసారు. మరో డ్రైవర్ వచ్చాక బస్సు హైదరాబాద్ బయలుదేరింది. ప్రాణాల మీదకు వచ్చినా సమయస్ఫూర్తితో 36 మంది ప్రయాణికులకు ప్రమాదం కలగకుండా సురక్షితంగా బస్సును నిలిపిన డ్రైవర్ అన్నవరంను అందరూ అభినందిస్తున్నారు. అన్నవరం త్వరగా కోలుకోవాలని సహ ఉద్యోగులు ఆశిస్తున్నారు.