పరువు హత్య భయంతో అడవిలో దాక్కున్న ప్రేమ జంట

కులాలు వేరైనా ఒకటయ్యారు కానీ ఊరు కుల పెద్దలు మాత్రం గ్రామంలోకి అడుగు పెడితే చంపుతాం అని బెదిరిస్తున్నారు , పోలీసులు కూడా చేతులెత్తేయడంతో చేసేదేమీ లేక ఎవరు కాపాడతారో తెలియక అడవిలోకి వెళ్లి బిక్కు బిక్కు మంటున్నారు .

ఉమ్మడి నల్లగొండ జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామనికి చెందిన ప్రశాంత్ అనే (ఎరుకల కులానికి చెందిన) వ్యక్తి జనగామ ప్రాంతానికి చెందిన సంధ్య అనే ( రెడ్డి కులానికి చెందిన )అమ్మాయిని గత రెండు సంవత్సరాలు గా ప్రేమిస్తున్నాడు. ఇరువురి కులాలు వేరు కావడంతో అమ్మయి ఇంట్లో ఒప్పుకోకపోవడం తో హైదరాబాద్ పారిపోయి ఓ గుడిలో పెళ్లి చేసుకొని హైదరాబాద్ లోనే ఉంటున్నారు.

ఈ మధ్య జరిగిన మిర్యాలగూడ , హైదరాబాద్  ఘటనలతో భయాందోళన కు గురైన ప్రశాంత్, సంధ్యలు హైదరాబాద్ వదిలి ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉందామనుకొని మొదటగా ఓ లాడ్జిలో రూమ్ తీసుకొని తలదాచుకున్నారు. మరుసటిరోజు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా విషయం అంతా చెప్పేశారు.

అడవిలో దాక్కున్న ప్రశాంత్, సంధ్య

 అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను పిలిపించి  పోలీసులు మాట్లాడారు వారి వల్ల ఎలాంటి ప్రాణహాని ఉండదని చెప్పి వారిని తమ స్వంత గ్రామానికి పంపించారు. గుండాల చేరుకున్న ప్రశాంత్, సంధ్యలు అబ్బాయి గ్రామమైన మరిపడిగ చేరుకున్నారు.

  గ్రామ పెద్దలు మాత్రం ఈ గ్రామంలో ఉండోద్దని తేల్చిచెప్పారు. పోలీసులను ఆశ్రయించిన కూడా ఫలితం లేకపోవడం తో  గ్రామం పక్కనే ఉన్న అడవిలో తల దాచుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమకు రక్షణ కల్పించి కాపాడాలని వేడుకుంటున్నారు.