ఆర్టీసి బస్సులో చినిగిన చీర… ప్రయాణికురాలికి మూడు వేల చెల్లింపు

ఆర్టీసి బస్సులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. సీటు మంచిగుంటే డోర్ మంచిగుండదు. డోర్ మంచిగుంటే అద్దం బాగుండదు. ఏదో ఓ రిపేర్ ఉంటనే ఉంటది. కాలం చెల్లిన బస్సులు తిప్పుతూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆర్టీసీ నష్టాల్లో ఉందని సమాధానం చెబుతారు. నల్లగొండ డిపో బస్సు ఎక్కిప్రయాణం చేస్తున్న ప్రయాణికురాలికి రేకు తగిలి చీర చినిగింది. ఆ రేకును సరిచేయాల్సిందిగా డ్రైవర్ ను కోరితే అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో ఆర్టీసికి తగిన రీతిలో ఆ ప్రయాణికురాలు బుద్ది చెప్పింది. అసలు వివరాలు ఏంటంటే…

హైదరాబాద్‌లో బంధువుల ఇంట జరుగుతున్న  పెళ్లికి హాజరయ్యేందుకు నల్గొండకు చెందిన భార్యాభర్తలు కట్టెకోల నరసింహారావు, వాణిశ్రీ నల్లగొండ డిపో ఆర్టీసీ బస్సెక్కారు. ఈ క్రమంలో మహిళ కట్టుకున్న పట్టుచీర బస్సు ప్రవేశ ద్వారం వద్ద బయటకు తేలిన రేకుకు తాకి చిరిగిపోయింది. దీంతో ఉసూరుమన్న వాణిశ్రీ ఆ రేకును సరిచేయాల్సిందిగా బస్సు డ్రైవర్‌ను కోరింది. అయితే, అది తమ పనికాదని, అది డిపో వ్యవహారమని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.

దీంతో దంపతులు డిపో మేనేజర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పట్టించుకోకపోవడంతో వారు ప్రయాణించిన బస్సు టికెట్, బయటకు తేలిన ఇనుప రేకు, బస్సు ఫొటోలతో నల్గొండలోని వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. గతేడాది ఆగస్టు 26న ఈ ఘటన జరిగింది. విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ బస్సులో లోపాలు నిజమేనని నిర్ధారించింది. పట్టు చీరకు రూ. 2 వేలు, ఇతర ఖర్చులకింద మరో వెయ్యి రూపాయిలు జరిమానాను చెల్లించాల్సిందిగా ఆర్టీసీని ఆదేశించింది.