న్యాయం చేయమంటే ఈ సీఐ… రూమ్‌కి రమ్మన్నాడు

ఎంతో పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో ఓ వైపు భక్తుల సందడి, మరో వైపు గోవింద నామాల స్మరణలతో మారుమోగుతుంటే … భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఓ సీఐ కీచకుడిగా మారాడు. న్యాయం చేయాలని కోరిన ఓ మహిళను తిరుమలలోని రూమ్ కు రావాలంటూ అసభ్యకరంగా, లైంగికంగా వేధించాడు. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…

పీలేరుకు చెందిన ఓ మహిళ తన భర్త వేధిస్తుంటే 10 సంవత్సరాల క్రితం కేసు పెట్టింది. ఆ కేసు కోర్టులో ఉంది. అయితే తన భర్త ఆమెకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న విషయం తెలిసి అదే రోజు తన భర్త పై కేసు పెట్టినట్టు తెలిపింది.

అయితే అప్పుడున్న సీఐ బదిలీ అవ్వగా… సిద్దతేజమూర్తి (వాయల్పాడు) ఇన్ ఛార్జీ సీఐ గా బాధ్యతలు స్వీకరించారు. అతనిని కలిసి న్యాయం చేయాలని కోరగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించాడని బాధిత మహిళ వాపోయింది.

ఓ సారి రాయచోటి వద్దనున్న గాలివీడులోని వారి సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి బలవంతం చేయబోగా అరిచి అందిరిని పిలిచి పరువు తీస్తానని చెప్పడంతో వెనక్కి తగ్గాడని తెలిపింది. మరోసారి ఇలాంటి తిక్క తిక్క వేషాలేస్తే డిఎస్పీ, ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించినా లెక్కచేయలేదని వాళ్లు కూడా పోలీసులే నన్నేం చేయరని బెదిరించడం మొదలుపెట్టారని తెలిపింది.

రెండు రోజుల కిందట ఫోన్ చేసి తిరుమల బ్రహ్మోత్సవాల కోసం తనకు డ్యూటి వేశారని నందకంలో రూము తీసుకుంటా.. వెంటనే రావాలంటూ బెదిరించాడని వాపోయింది. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లేందుకు తిరుమలకు వచ్చానని కానీ ఆయన బిజీగా ఉండటంతో కలిసే అవకాశం దొరకక విలేఖరులకు చెప్పుకున్నానంది.

సీఐ సిద్దతేజమూర్తి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరుతానంది. ఈ నేపథ్యంలో కర్నూల్ రేంజ్ డిఐజీ శ్రీనివాస్ సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

వాయల్పాడు సీఐ పై  ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని  వదిలిపెట్టవద్దని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చంద్రబాబు హామీనిచ్చారు.