హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మరో సారి రెచ్చిపోయారు. 12 గంటల వ్యవధిలో 10 ప్రాంతాల్లో మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులను లాక్కెళ్లి పోలీసులకు సవాల్ విసిరారు. ఒక్క ఎల్బీ నగర్ జోన్ లోనే ఏడు చైన్ స్నాచింగ్ ఘటనలు జరిగాయి. హయత్ నగర్ పరిధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు.
హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీలో లక్ష్మమ్మ అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు. కుంట్లూర్ రోడ్ లో నిర్మల అనే మహిళ నుంచి రెండున్నర తులాల గొలుసును దొంగిలించారు. చైన్ స్నాచింగ్ లపై వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుండటంతో వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. దుండగులను గుర్తించేందుకు ఘటనలు జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఇది ఖచ్చితంగా ఇతర రాష్ట్రాల ముఠాల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా దొంగతనాలు జరగడంతో ముందుగా రెక్కీ నిర్వహించి ప్రణాళిక ప్రకారమే చేశారని భావిస్తున్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు 6 బృందాలతో దొంగల కోసం వేట సాగిస్తున్నారు. చైన్ స్నాచింగ్ కలకలం రేపడంతో మహిళలు ఇంట్లో నుంచి రావాలంటేనే భయపడుతున్నారు. వచ్చినా బంగారం లేకుండా బయటికి వెళుతున్నారు. 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. చైన్ స్నాచర్లు చోరికి పాల్పడిన వీడియో కింద ఉంది చూడండి.