ఫ్లాష్ న్యూస్.. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న ఆలయం నుంచి  కిందకు దిగుతున్న బస్సు ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 51  మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరో 20 మందికి గాయాలయినట్టు తెలుస్తోంది. జగిత్యాల డిపోకు చెందిన బస్సు కొండగట్టు నుంచి కిందకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు అధికంగా ఉన్నారు. ప్రమాద స్థలం అంతా భీకరంగా మారింది. గాయపడిన వారిని కరీంనగర్, జగిత్యాల ఆసుపత్రులకు  తరలించి చికిత్స  అందిస్తున్నారు. బస్సు లోయలో పడటంతో ఊపిరాడక అధిక మంది చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వీడియో కింద ఉంది చూడండి.

వీడియో కోసం దీని పై  క్లిక్ చేయండి. 

 

 

 

ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు

ఘాట్ రోడ్డు దిగుతుండగా బస్సు బ్రేకులు ఫెయిలై ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సోమవారం పేట నుంచి బయలు దేరిన బస్సు ఘాట్ రోడ్డు వద్ద స్పీడ్ బ్రేకర్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. అంజన్న ఆలయమైన కొండగట్టులో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. ప్రమాద స్థలంలో క్షతగాత్రుల, మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలియగానే ప్రమాద స్థలానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ సింధు శర్మ చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బస్సులో  ఎక్కువగా డబ్బ తిమ్మాపూర్, శనివారం పేట, రాంసాగర్, ఇమ్మత్ రావు పేట గ్రామాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. 10 అంబులెన్స్ ల ద్వాారా క్షతగాత్రులను, మృతులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 25 మంది మహిళలు ఉన్నారు. అధిక మంది జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల వారు ఉన్నారు.

బస్సులో 70 మంది ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులోనే మరికొంత మంది ఇరుక్కుపోయారు. వారిని బయటికి తీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు భారీ ఎత్తున్న భక్తులు వచ్చారు. డ్రైవర్ కు అనుభవం లేకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు డిపో మేనేజర్ తెలిపారు. ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మేనేజర్ తెలిపారు.  డ్రైవర్ శ్రీనివాస్ మద్యం మత్తులో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాసులుకు రెండు కాళ్లు విరిగిపోయాయి. 

 

ప్రమాదం పై గవర్నర్ నరసింహన్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం  అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తో గవర్నర్ ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రమాదం పై ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రమాదం పై అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 8 లక్షల ఎక్స్ గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. 

ప్రమాద విషయం తెలుసుకున్న అపద్దర్మ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ కవిత  స్పందించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీనిచ్చారు. వైద్యం ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులను ఆదేశించినట్టు ఈటెల రాజేందర్ తెలిపారు.

బస్సు ప్రమాదం పై టిపిసిసి చీఫ్ ఉత్తమ్, టిడిపి రమణ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు.