రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం జరిగింది. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్రిజ్ పేలి బిటెక్ అమ్మాయి చనిపోయింది. ఈ ఘటన అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.
ఆదిభట్ల మండలంలోని బొంగ్లూరు గేట్ సమీపంలో ని మై హోం కాలనీలో కొంపల్లి మనోహర్, లావణ్య దంపతులు నివాసం ఉంటున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. అతని పెద్ద కూతరు దీపిక బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. మనోహర్ స్వస్థలం దేవరకొండ. మనోహర్ టివిల రిపేర్ వర్క్ చేస్తాడు. లావణ్య టైలర్ పని చేస్తుంది. కాగా ఉపాధి కోసం దేవరకొండ నుంచి వచ్చి వారు బొంగ్లూరులోనే సెటిలయ్యాడు. దీపికకు ప్రస్తుతం బిటెక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అవుతుంది.
గురువారం దీపిక తండ్రి పని కి పోగా తల్లి బంధువుల ఫంక్షన్ కి వెళ్లింది. సోదరి పాఠశాలకు వెళ్లింది. దీపిక ఇంట్లో ఉండి చదువుకుంటూ నీళ్లు తాగుదామని ఫ్రిజ్ ఓపేన్ చేసింది. అంతే గట్టి సవుండ్ తో ఫ్రిజ్ పేలిపోయింది. ఇళ్లంతా దెబ్బతింది. పెద్ద శబ్దానికి ఇంటి పక్క వారు వచ్చి చూడగా దీపిక అప్పటికే ప్రాణాలు వదిలింది. పేలుడు ధాటికి ఇల్లంతా దెబ్బతింది. ఇంట్లోని వస్తువులన్నీ ఆగమాగంగా ఎగిరి పడ్డాయి. ఇళ్లంతా మాడి మసై పోయింది. ఘటన జరగగానే స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. అగ్ని మాపక సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపి వేసి ఇంట్లోని మంటలను ఆర్పారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనను చూసిన వారు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీపిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తరలించారు.
దీపిక అందరితో కలుపుగోలుగా ఉండేదని అనుకోకుండా తన ప్రాణాలు కోల్పోయే సరికి బొంగ్లూరులో విషాద చాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అకాల మరణం చెందే సరికి ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. స్నేహితురాలు దూరం అవ్వడంతో దీపికి ఫ్రెండ్స్ విచారం వ్యక్తం చేశారు. మాతో కలిసి ఉండే ఫ్రెండ్ ఇక లేదా అంటూ వారు రోధించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఫ్రిజ్ పేలిన ఘటనను చూడడం ఇదే ఫస్ట్ అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రిజ్ అప్పుడప్పుడు షాక్ వచ్చేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.