బెజవాడలో టివి జర్నలిస్టులపై  అయ్యప్ప భక్తుల దాడి (వీడియో)

విజయవాడలో టివి  జర్నలిస్టులపై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. శబరిమలకు మహిళలు కూడా వెళ్ల వచ్చన్న సుప్రీం తీర్పుతో మోజో టివి మహిళా రిపోర్టర్ ను అక్కడికి పంపించింది. అక్కడ పరిస్థితుల దృష్ట్యా ఆ రిపోర్టర్ వెనక్కి తిరిగి వచ్చింది. బెజవాడలో బుధవారం పలువురు అయ్యప్ప భక్తులు మోజో టివి  రిపోర్టర్ల పై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. ఆందోళన వీడియో కింద ఉంది చూడండి. 

విషయం తెలుసుకున్న పోలీసులు  జర్నలిస్టులను విడిపించి అయ్యప్ప భక్తులను పంపించారు. అయినా కూడా అయ్యప్ప భక్తులు శాంతించకపోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.   ఈ ఘటనను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకే దిక్కు లేకపోతే ఇక దేశం పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పటం తప్పా అని వారు అయ్యప్ప భక్తులను ప్రశ్నించారు. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు విజయవాడ సిపికి ఫిర్యాదు చేయనున్నాయి. 

కేరళలోని శబరిమల అయ్యప్పను మహిళలు కూడా దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును కొంత మంది స్వాగతించగా మరికొంత మంది వ్యతిరేకించారు. ఈ తీర్పు పై శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలను శబరిమలకు ఎట్టి పరిస్థితిలో రానిచ్చేది లేదని కొంత మంది వ్యతిరేకించారు. వారిని అనుమతిస్తే ఆగ్నికి ఆహూతయితామని బెదిరించారు. కేరళ సర్కారు మాత్రం  ఎట్టి పరిస్థితిలోనూ సుప్రీం తీర్పును అమలు చేసి తీరుతామని ప్రకటించింది.  

అనేక మంది మహిళలు శబరిమలకు వెళ్లే ప్రయత్నం చేశారు. వ్యతిరేకులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగి వచ్చారు. పోలీస్ రక్షణలో వెళ్లినప్పటికి కూడా తీరా దగ్గరికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. అయ్యప్ప దర్శనాన్ని మాత్రం చేసుకోలేక పోయారు. మోజో టివి కూడా తమ రిపోర్టర్ ను పంపి అయ్యప్ప దర్శనం చేయించేందుకు ప్రయత్నించింది కానీ అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రిపోర్టర్ అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగి వచ్చింది.   

బుధవారం విజయవాడలో సిపిఐ వారు ఆందోళన చేస్తుండగా దానిని కవర్ చేయడానికి మోజో టివి రిపోర్టర్, కెమెరామెన్ లు వెళ్లారు. అక్కడ ఉన్న కొంత మంది అయ్యప్ప భక్తులు మోజో టివి రిపోర్టర్, కెమెరామెన్ పై ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉన్న పోలీసులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో రిపోర్టర్, కెమెరామెన్ లకు గాయాలయ్యాయి.