సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంతో ఇష్టంగా గణేష్ మండపాన్ని అలంకరిస్తున్న విద్యార్థి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన అందర్నీ కలచివేసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేటకు చెందిన దాదిగారి శ్రీనివాస్ గౌడ్, రాజమణి దంపతులకు పూజిత, సాయికిరణ్ గౌడ్ సంతానం. పూజిత డిగ్రీ చదువుతుండగా సాయికిరణ్ గౌడ్ (16) లింగంపల్లి గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.
లింగంపల్లి గురుకుల పాఠశాలలో వినాయక చవితి వేడుకలలో భాగంగా, విద్యార్థులందరూ పాఠశాల సిబ్బందితో కలిసి మండపం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం రాత్రి మండపం లోపల రంగురంగుల విద్యుత్ దీపాలనాలంకరిస్తుండగా వర్షం కురిసింది. మండపంలో ఉన్న సాయి కిరణ్ గౌడ్ వసతి గృహంలోకి వెళుతూ పక్కనే ఉన్న ఇనుప పైపును పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి కుప్పకూలాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు వెంటనే విద్యుత్ సరఫరాని నిలిపివేయడంతో ఇతర విద్యార్థులకు అపాయం తప్పింది. విద్యుదాఘాతానికి గురైన సాయికిరణ్ గౌడ్ ను గురుకుల సిబ్బంది తమ కారులో జహీరాబాద్ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు నిర్ధారించారు.
కుమారుడు మరణించిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గురుకుల క్రీడల్లో కబడ్డీ విభాగంలో రాష్ట్రస్థాయిలో ఆడుతూ ఉండే తమ కుమారుడు విగత జీవిగా ఉండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. జహీరాబాద్ ఆసుపత్రి ఎదుట పిడిఎస్యూ, ఎస్ఎఫ్ఐ, స్వేరోస్ సంఘాలతో పాటు బీఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు… గురుకుల పాఠశాల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు.