రాజస్థాన్ లో దారుణం.. దళిత విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు?

దేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ దళితుల మీద వివక్ష చూపుతూనే ఉన్నారు. గతంలో రాజస్థాన్ లో దొంగతనం చేశాడన్న నెపంతో ఒక దళిత విద్యార్థి పై ఉపాధ్యాయులు దాడి చేసిన ఘటనలో విద్యార్థి మరణించిన ఘటన కలకలం రేపింది. ఆ ఘటన మరవకముందే రాజస్థాన్ లో ఇటువంటి దారుణ సంఘటన మరొకటి చోటు చేసుకుంది. 7 వ తరగతి చదువుతున్న విద్యార్థి పై ఉపాధ్యాయుడు చేసిన దాడితో విద్యార్ధి తీవ్ర గాయాలపాలయ్యి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలో జరిగింది.

వివరాలలోకి వెళితే… బర్మార్ జిల్లాలో స్థానికంగా ఉన్న పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అశోక్ మాలి అనే ఉపాధ్యాయుడు దారుణంగా శిక్షించాడు. పాఠశాల గదిలో గోడకు నిలబెట్టి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే తరగతిలో చదువుతున్న బాధితుడి సోదరుడు తన సోదరుడిని శిక్షించటం చూసి వెంటనే తరగతి నుండి బయటకు పరిగెత్తుకెళ్ళి మరొక గదిలో ఉన్న ఉపాధ్యాయులకి విషయం చెప్పాడు. దీంతో అందరూ హుటాహుటిన తరగతి గదిలోకి వెళ్లేసరికి అశోక మాలి అనే ఉపాధ్యాయుడు విద్యార్థి మీద దాడి చేస్తున్నాడు.

పాఠశాలలో ఉన్న ఇతర ఉపాధ్యాయులు ఆ దాడిని ఆపి వెంటనే బాధితుడిని అతని సోదరుడిని ఇంటికి పంపించారు. అయితే ఇంటికి చేరుకున్న బాధిత విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో తలనొప్పి కడుపునొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతను కుటుంబ సభ్యులు విద్యార్థిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.