విజయనగరంలో దారుణం… కొడుకు తినే అన్నంలో విషం కలిపిన తల్లి?

నవమాసాలు మోసి పిల్లల్ని కన్న తల్లి తండ్రులు రేయింబవళ్ళు కష్టపడి వారిని ప్రయోజకులుగా చేయాలని తాపత్రయపడుతుంటారు. కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల కష్టానికి విలువ ఇవ్వకుండా చెడు వ్యసనాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కన్న తల్లిదండ్రులే వారిని చంపటానికి ప్రయత్నం చెస్తున్నారు. ఇటీవల కూడా ప్రమాదంలో కాళ్లు విరిగి మంచాల పడ్డ యువకుడు తల్లి చేతిలో హత్యకి గురయ్యాడు. ఈ దారుణ సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…విజయనగరం జిల్లా డెండాక మండలానికి చెందిన గొడ్డు రామాయమ్మ కూతురు సునీత, కొడుకు సాయి (20)తో కలిసి నివసిస్తుంది. రెండేళ్ల క్రితం రామాయమ్మ భర్త చనిపోవడంతో పూసపాటిరేగ మండలం గుండపు రెడ్డిపాలెంలో ఉన్న ఫార్మా కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. అయితే తండ్రి మరణించిన తర్వాత కూడా సాయి బాధ్యత రహితంగా ప్రవర్తించడమే కాకుండా చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఒకరోజు మద్యం మత్తులో ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో సాయి చాలా కాలంగా మంచం మీదే ఉన్నప్పటికీ తల్లి అన్ని సేవలు చేసేది.

కానీ సాయి మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా తనకు తాగటానికి మద్యం తినటానికి మాంసం కావాలని తల్లిని వేధించేవాడు. దీంతో రామాయమ్మ కొడుకు ప్రవర్తనతో విసుగు చెంది అతను తినే అన్నంలో పురుగుల మందు కలిపింది. ఆహారం తిన్న సాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రాములమ్మ స్వయంగా 108 ని పిలిపించి అతనిని విజయనగరం ఆస్పత్రికి తరలించగా శనివారం అతడు మృతి చెందాడు. తన సోదరుడి మృతి పట్ల అనుమానం వచ్చిన సునీత తన తల్లిని ప్రశ్నించగా… ప్రతిరోజు సాయి పెట్టే బాధలు భరించలేక తానే అన్నంలో పురుగుల మందు కలిపి హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని రామయమ్మని అదుపులోకి తీసుకున్నారు.