మహారాష్ట్రలో దారుణం.. ప్రేమకు అడ్డుగా ఉందని కన్నతల్లిని కడతేర్చిన కూతురు..!

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఏమీ తెలియని వయసులోనే ప్రేమలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అది ప్రేమ, వ్యామోహం అన్న తేడా కూడా తెలియకుండా ఎంతోమంది యువతులు యువకుల చేతుల్లో మోసపోతున్నారు. అయితే మరి కొంతమంది వారు ప్రేమించిన వ్యక్తుల కోసం తల్లిదండ్రులను కూడా ఎదిరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది తల్లిదండ్రులు ప్రేమకు నిరాకరించారన్న కారణంతో పిల్లలు వారిని హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. కూతురి ప్రేమ వ్యవహారాన్ని ఖండించిన తల్లిని ప్రియుడుతో కలిసి ఆ కూతురు దారుణంగా హత్య చేసి పరారయింది.

వివరాలలోకి వెళితే…ముంబ్రాలోని అమృత్ నగర్ ప్రాంతంలో సబా హష్మి అనే 37 ఏళ్ల మహిళ తన ముగ్గురు కూతుర్లతో కలిసి నివసిస్తోంది. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు అయి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో సబా హహ్మి స్థానికంగా ఉన్న పిల్లలకు చదువు చెబుతూ తన ముగ్గురి కూతుర్లను పోషిస్తుంది. వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండటంతో బంధువులు కూడా వారికి ఆర్థిక సహాయం చేసేవారు.

ఇలా భర్త తోడు లేకపోవడంతో తల్లి తన పిల్లల్ని పెంచడానికి కష్టపడుతుంటే.. 17 ఏళ్ల వయసు ఉన్న సబా కూతురు స్థానికంగా నివసిస్తున్న ఒక 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న సబా వారి ప్రేమను వ్యతిరేకించింది. అయినప్పటికీ యువతి తల్లి మాటను లెక్కచేయకుండా తన ఇంట్లోనే ఆ యువకుడితో ఏకాంతంగా గడుపుతూ ఉండేది. ఇలా ఇద్దరు ఏకాంతంగా ఉండటం గమనించిన సబా కూతురిని దండించటంతో ఆగ్రహానికి గురైన యువతి తన ప్రియుడితో కలిసి తన తల్లిపై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారయింది. అయితే దాడిలో తీవ్రంగా గాయపడిన సబా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి సదరు బాలికని ఆమె ప్రియుడిని గాలించి పట్టుకున్నారు.