కాబోయే భార్యను హత్య చేసిన యువకుడికి అరుదైన శిక్ష వేసిన విశాఖ కోర్టు

అద్దం పగులగొట్టి ఆ గాజు పెంకుతో కాబోయే భార్య గొంతు కోసి అతి కిరాతకంగా చంపిన యువకుడికి విశాఖ కోర్టు అరుదైన శిక్ష విధించింది. నిందితుడికి రెండు యావజ్జీవ శిక్షలు ఏక కాలంలో అమలు చేయాలని చారిత్రాత్మక తీర్పు చెప్పింది. 2017 జూలై 8 వ తేదిన విశాఖ పూర్ణా మార్కెట్ సమీపంలోని పండా వీధిలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో అందరి హృదయాలను కలిచి వేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

విశాఖలోని పండా వీధిలో నివసిస్తున్న బొందలపు సతీష్ కుమార్, రంగిరీజు వీధిలో నివసిస్తున్న బూరలి భవానిల పరిచయం వారి ప్రేమకు దారితీసింది. వీరిద్దరి వ్యవహారం ఇంట్లో తెలియడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి. ఇంతలో సతీష్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. భవానీ పై అనుమానాలు వ్యక్తం చేయడం, అక్రమ సంబంధాలు అంటగట్టడం, నిత్యం అనుచిత మాటలతో భవానిని వేధించేవాడు.

2017 జూలై 8 న మధ్యాహ్న 1 గంటలకు సతీష్ భవానికి ఫోన్ చేసి తమ ఇంటికి రావాలని పిలిచాడు. దీంతో భవాని సతీష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సతీష్ ఇంట్లో ఎవరూ లేరు. సతీష్ భవానిని తిట్టి ఆమెతో గొడవ పడ్డాడు. ఇంతలోనే భవాని తలుపులు కొడుతూ బయటి వారిని సహాయం కోసం పిలిచింది. సతీష్ అప్పటికే కిటికిని పగులగొట్టి అ అద్దం గ్లాసుతో భవాని మెడ పై పొడిచాడు.

అరుపులు విన్న స్థానిక యువకులు భవానినీ కాపాడే ప్రయత్నం చేయగా వారి పై కూడా గాజు పెంకుతో దాడి చేస్తానని, ఇనుప డంబెల్ తో దాడి చేస్తానని బెదిరించాడు. గ్యాస్ లీక్ చేసి ఇల్లు పేలుస్తానని కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత సతీష్ రాక్షస రూపం ఎత్తి అందరూ చూస్తుండగానే ఆమె శరీరం పై, సున్నిత ప్రదేశాలలో గాజు పెంకుతో ఆమె శరీరం పై ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. అంతటితో ఆగకుండా ఇనుప డంబెల్ తీసుకొని ఆమె తల పై బలంగా కొట్టాడు. దీంతో భవానీ రక్తపు మడుగులో కొట్టుకుంటూ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. 

సతీష్ భవానీతో కలిసి ఉన్నప్పటి ఫోటో

సతీష్ భవానీ మృతదేహాన్ని రోడ్డు పై అతి కిరాతకంగా ఈడ్చుకొస్తుండగా స్థానిక యువకులు అప్పుడు దైర్యం చేసి అతడిని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ప్రత్యక్ష సాక్షులంతా భవానీ కుటుంబానికి అండగా నిలవడంతో కేసు విచారణ త్వరగా సాగింది.

అతి కిరాతకంగా ప్రవర్తించిన సతీష్ ను ఉరి తీయాలని పలువురు డిమాండ్ చేశారు. కేసు పూర్వాపరాలు విన్న జడ్జి అరుదైన తీర్పునిచ్చారు. ఏక కాలంలో రెండు జీవిత ఖైదులు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అతి కిరాతకంగా ప్రవర్తించిన కారణంగా ఇటువంటి శిక్ష విధిస్తున్నామన్నారు. ప్రేమ పేరుతో క్రూరంగా ప్రవర్తించే వారికి ఈ శిక్ష కనువిప్పు కావాలన్నారు.