బిడ్డ బాధ తల్లికే అర్దమవుతుందని ఊరికే అనలేదు. గుక్క పట్టి ఏడుస్తున్న ముక్కు ముఖం తెలియని పసిపాపకు ఆ తల్లి పాలిచ్చి లాలించింది. పోలీసులంటే కఠినంగా కాదు ప్రేమగా ఉంటారని నిరూపించింది ఆ మహిళా పోలీస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడామే హాట్ టాపిక్ గా మారారు. కోట్లది మంది ప్రజల అభిమానాన్ని చురగొన్నారు. ఎవరామే ఏంటా కథ తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…
ఆదివారం అర్దరాత్రి ఒంటి గంట అవుతుంది. అది అప్జల్ గంజ్ ప్రాంతం. ఇంతలో ఓ మహిళ ఫుల్ గా మందు తాగి పాపను ఎత్తుకొని ఉంది. మందు తాగిన ఆమె ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు. యాకత్ పురాకు చెందిన యువకుడు ఇంటికి వెళ్లేందుకు అక్కడ ఉన్నాడు. ఆ మహిళ ఆ యువకుడి వద్దకు వచ్చి నీళ్లు తాగి వస్తానని చెప్పి పాపను అతనికి అప్పగించి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాలేదు. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో ఆ పాపను తీసుకొని వారింటికి వెళ్లాడు. పాపకు పాకెట్ పాలు తాపించేందుకు ప్రయత్నించాడు. కానీ పాప ఏడుపు ఆపలేదు.
దీంతో ఆ యువకుని కుటుంబ సభ్యులు పాపను అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు. పాపను కానిస్టేబుల్ రవీంద్రకుమార్ ఓదార్చే ప్రయత్నం చేయగా పాప ఏడుపు ఆపలేదు. ఇంతలో రవీంద్ర కుమార్ తన భార్య ప్రియాంకకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఫోన్ లో పాప ఏడుపు వినపడడంతో ప్రియాంక ఎవరని అడగగా ఎవరో పాపను తెచ్చి ఇచ్చారని పాప ఏడుపు ఆపడం లేదని తెలిపాడు. ప్రియాంక బేగంపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది.
వెంటనే ప్రియాంక తన కొడుకుని వారి అమ్మకు ఇచ్చి బేగంపేట నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అప్జల్ గంజ్ స్టేషన్ కు చేరుకుంది. పాపను దగ్గరకు తీసుకొని పాపకు పాలిచ్చింది. ఆ తర్వాత పాప ఏడుపు ఆపి నిద్రపోయింది. ఓ తల్లిగా బిడ్డ బాధను అర్దం చేసుకున్న ప్రియాంకను అంతా అభినందిస్తున్నారు. ఈ విషయం పై ప్రియాంక మీడియాతో మాట్లాడారు ఆమె ఏమన్నారంటే…
“అర్దరాత్రి రవీంద్ర కుమార్ నాకు ఫోన్ చేశాడు. పాప ఏడుస్తున్న గొంతు వినపడింది. ఆయనను అడగగా విషయం చెప్పాడు. పాల అంతలా గుక్కపట్టి ఏడుస్తుంటే ఒక తల్లిగా ఆ బాధ నాకు అర్దమైంది. ఏదో తెలియని బాధ… ఆ పాపకు ఏమవుతుందో అన్న ఆందోళన.దీంతో మరొకటి ఆలోచించకుండా ఎనిమిదినెలలు ఉన్న మా బాబును అమ్మకు అప్పగించాను. వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని అప్జల్ గంజ్ స్టేషన్ కు చేరుకున్నాను.
అప్పటికి ఆ పాప గట్టిగా కళ్లు మూసుకొని గుక్కపట్టి ఏడుస్తుంది. మరో పక్క పాపకు దుస్తులు లేకపోవడంతో చలికి ఒణుకుతుంది. ఆ పసికందును అలా చూసి నాకే ఏడుపు వచ్చింది. వెంటనే ఆలస్యం చేయకుండా పాపకు చనుబాలు పట్టాను. దాదాపు 40 నిమిషాల పాటు చన్ను వదల్లేదు. కడుపారా పాలు తాగాక నెమ్మదిగా కళ్లు తెరిచింది. అప్పుడు నాకు హమ్మయ్య అనిపించింది. ఆ తర్వాత ఆ పాపను మెటర్నిటి ఆస్పత్రికి తీసుకెళ్లి అప్పగించాను. నేను ఇంటికి తిరిగి వెళ్లాను.” అని ప్రియాంక తెలిపింది.
పాప తల్లిదండ్రుల గురించి ఆరా తీయగా పాప తండ్రి జేబు దొంగతం కేసులో చంచల్ గూడ జైల్లో ఉన్న ఫిరోజ్ ఖాన్ గా గుర్తించారు. ఆయనను విచారించగా వివరాలు తెలిశాయి. వారు ఉస్మానియా సమీపంలో ని ఓ షెడ్డులో నివాసం ఉంటున్నట్టుగా గుర్తించారు. తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి రోజు సాయంత్రం పాపను స్టేషన్ లో చూయించాలన్న షరతు విధించి పాపను అప్పగించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రవీంద్ర, ప్రియాంకలను అభినందించారు. ప్రియాంక బేగంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ప్రస్తుతం ప్రియాంక సెలవుల్లో ఉంది. సిపి అంజనీకుమార్ ప్రియాంక దంపతులను అభినందించి సన్మానించారు.