వివాహం తర్వాత భర్త నుండి అత్తమామల నుండి చాలామంది మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కొంతమంది వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఒంటరిగా బ్రతకటానికి ప్రయత్నాలు చేస్తుంటే మరి కొంతమంది మాత్రం తీవ్ర మనస్థాపనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వారు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకోవటమే కాకుండా పసి పిల్లల ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల వల్ల వివాహిత తాను ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా తనతో పాటు తన కుమారుడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో సోమవారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్ మండలం బదనకల్‌కు చెందిన శరత్ అనే వ్యక్తితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు శివతేజ ఉన్నాడు. పెళ్లి తర్వాత కొంతకాలం సజావుగా సాగిపోయిన వీరి జీవితంలో కలహాలు ఏర్పడ్డాయి. రోజు రోజుకి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగి గొడవలు పెద్దవి కావడంతో స్వాతి సంవత్సరం క్రితం తన భర్తని వదిలేసి కొడుకుతో పాటు తల్లిదండ్రులు వద్దకు వచ్చి వారితో కలిసి నివసిస్తోంది.
ఈ క్రమంలో సిద్దిపేటలో ఉన్న ఒక షో రూమ్ లో పనిచేసే తన కొడుకుని చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే భర్తకు దూరంగా వచ్చినా కూడా అతడు వేధింపులకు గురి చేయటంతో స్వాతి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులకు కూడా భారం కాకూడదని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి తన మూడేళ్ల కుమారుడిని తన నడుముకి కట్టుకొని చెరువులోకి దూకింది. స్వాతి చెరువులోకి దూకటం గమనించిన గొర్రెలు కాపరులు వెంటనే చెరువులోకి దూకి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అయితే బాలుడు నీటిలో మునిగి మృతిచెందగా స్వాతి మాత్రం ప్రాణాలతో బయటపడింది. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నా కొడుకు ప్రాణాలు పోయాయి అంటూ స్వాతి కుమారుడి మృతదేహం వద్ద రోదించింది . ఈ పరిస్థితికి కారణమైన తన భర్త మీద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.