ఎస్సై వలలో చిక్కుకున్న హోంగార్డు… చివరకు ఏం జరిగిందో తెలుసా?

ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తాం. ఎందుకంటే పోలీసుల మీద అపారమైన నమ్మకం. వారు తప్పుని సరిదిద్దుతారని భరోసాతో వారి చెంతకు వెళతాం. అదే పోలీసుల తప్పు చేస్తే అబాసు పాలవక తప్పదు. పోలీసులు మనో ధైర్యంతో ఈ మధ్యకాలంలో చాలామంది న్యాయానికి విరుద్ధంగా నేరాలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా పోలీస్ ఉద్యోగం ఉండటంతో బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఒక ఎస్ఐ తనతో పాటు పనిచేస్తున్న హోంగార్డును మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… కృష్ణాజిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది . బంటుమిల్లు ఎక్సైజ్ ఎస్సైగా పనిచేస్తున్న కిషోర్.. అదే శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న నాగలక్ష్మిని నమ్మించి మోసం చేశాడని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఆ బాధిత మహిళ. నాగలక్ష్మికి గతంలోనే పెళ్లి అయ్యి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సబ్ జైల్ లో హోంగార్డుగా పనిచేస్తున్న నాగలక్ష్మి భర్త కొంతకాలం క్రితం చనిపోయాడు. తర్వాత తనతో పాటు పనిచేస్తున్న కిషోర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పెరిగి నాగలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికి ఆమెతో గత నాలుగు సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని తెలిపింది. ఆమె పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటానని నమ్మబలికాడు.

నాగలక్ష్మి పెళ్లి విషయం తీసుకురాగా నాకు ఎస్ఐగా ప్రమోషన్ వస్తుందని తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఈ నేపధ్యంలో తనకు ప్రమోషన్ కోసం డబ్బులు కావాలి అని చెప్పి నాగలక్ష్మి వద్ద ఉన్న రెండు లక్షల రూపాయలను తీసుకున్నాడు. కిషోర్ కు ఎస్ఐగా ప్రమోషన్ దక్కింది. ఎస్సైగా ప్రమోషన్ వచ్చింది, పెళ్లి చేసుకుందామని నాగలక్ష్మి అడగగా, అతని నిర్లక్ష్యపు సమాధానం చూసి మోసం చేశాడని ఆమె గమనించింది. తన కూతురు పెళ్లి కోసం దాచుకున్న రెండు లక్షల డబ్బు ఇవ్వాలని అడగగా… తాను ఎస్ఐని అని నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అని ఆమెను బెదిరించాడు. దీంతో చేసేదేమీ లేక జిల్లా ఎస్పీని ఆశ్రయించింది ఆ బాధితురాలు. వారి సహజీవనానికి సంబంధించిన వీడియోలు ఫోటోలను కూడా ఆయనకు ఫిర్యాదుతో జత చేసి ఇచ్చింది. కేసును దిశ స్టేషన్ కు బదలాయించాడు ఎస్పీ.