ఈ మధ్య కొన్ని జబ్బులు వైద్య శాస్త్రానికే సవాల్ విసిరేలా ఉంటున్నాయి. ఇటీవలె ఓ యువతి వెన్ను నొప్పితో నిమ్స్ ఆస్పత్రికి వెళ్ళగా వెన్నులో బుల్లెట్ బయటపడటం కలకలం సృష్టించింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన అస్మా బేగం (18) అనే యువతి శరీరంలో వైద్యులు బుల్లెట్‌ను గుర్తించారు. వెన్నుపూస వెనుక భాగంలో బుల్లెట్ విరిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఏడాది కాలంగా ఇది శరీరంలో ఉన్నట్లు నిర్ధారించారు. అయితే.. ఆ యువతి శరీరంలో బుల్లెట్ ఎలా దిగింది? కుటుంబసభ్యులు దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు అన్నది మాత్రం ప్రస్తుతం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే…
బాధితురాలికి శస్త్రచికిత్స చేసి వైద్యులు బుల్లెట్‌ను బయటికి తీశారు. బుల్లెట్ ఉన్న విషయాన్ని గుర్తించిన షాక్ తిన్నారు. మెడికో లీగల్ కేసు కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రికి వచ్చి పరిశీలించి యువతి కుటుంబసభ్యులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బహదూర్‌పురాకు చెందిన అస్మా బేగం రెండు నెలల కిందట నిమ్స్ ఆస్పత్రికి వచ్చిందని.. తనకు వెన్నుపూస భాగంలో తీవ్ర స్థాయిలో నొప్పి ఉందని తెలిపిందని వైద్యులు చెప్పారు. ప్రాథమిక చికిత్స కోసం మెడిసిన్స్ రాసి పంపించినట్లు వెల్లడించారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి మళ్లీ ఆస్పత్రికి రాగా.. నొప్పితీవ్రతను బట్టి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తదని తెలుపగా … శనివారం రాత్రి తీవ్రమైన నొప్పి రావడంతో అస్మా బేగంను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
అస్మా బేగంకు ఎక్స్‌రే తీయగా వెన్నుపూస భాగంలో ఓ నల్లని వస్తువు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే శస్త్ర చికిత్సకు ఏర్పాటు చేశారు. ఆదివారం (డిసెంబర్ 22) ఉదయం ఆమెకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ సమయంలో బయటపడ్డ వస్తువును చూసి వైద్యులు ఖంగుతిన్నారు. ఆస్మా బేగం శరీరం నుంచి బుల్లెట్ బయటపడటంతో వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఏడాది కిందట గుర్తు తెలియని వ్యక్తులు తమ కుమార్తె పై కాల్పులు జరిపారని యువతి తల్లిదండ్రులు తెలిపారు. అయితే.. ఇంత కాలంగా అస్మా బేగం శరీరంలో బుల్లెట్ ఉన్నప్పటికీ ఎందుకు చెప్పలేదనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. ఆపరేషన్ నిర్వహించిన కారణంగా ప్రస్తుతానికి ఆమెను పూర్తిస్థాయిలో ప్రశ్నించలేదు. కాస్త కోలుకున్న తర్వాత ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరిస్తామని పోలీసులు వెల్లడించారు. ఇంతకీ అసలు మిస్టరీ ఏంటన్నది వీడలేదు. అస్మాబేగం కోలుకుంటే తప్పించి పోలీసులకు వివరాలు తెలిసే అవకాశం లేదు.