విమానాల్లో తిర‌క్కుండా, ఏటా దావోస్‌కు వెళ్లకుండా రూ.3.4 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

రాష్ట్రంలో ఏ కొంచెం పురోభివృద్ధి క‌నిపించినా, అదంతా త‌న ఘ‌న‌తే అనే ముఖ్య‌మంత్రిని చూశాం. చూస్తున్నాం. 90 శాతం వ‌ర‌కు పూర్త‌యిన ప్రాజెక్టుల గేట్లు ఎత్తేసి, తానే పూర్తి చేశాన‌ని చెప్పుకొన్న ఘ‌ట‌న‌లూ చాలానే ఉన్నాయి. పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రి మాత్రం అలాక్కాదు.

ఆ క్రెడిట్ అంతా ఆయ‌న దివంగ‌త ముఖ్య‌మంత్రికి ఇచ్చేశారు. అంతా ఆమే చేశార‌ని, తాను నిమిత్త‌మాత్రుడిన‌ని విన‌యంగా చెప్పుకొన్నారు. పెట్టుబ‌డుల పేరుతో ఏ ఒక్క దేశానికీ వెళ్ల‌లేదు. ఏటా దావోస్ స‌ద‌స్సుకు అస్స‌లు హాజ‌రు కాలేదు.

ఆయ‌నే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎడ‌ప్పాడి ప‌ళ‌నిస్వామి. ఆ దివంగ‌త ముఖ్య‌మంత్రి జయ‌ల‌లిత‌. చెన్నైలో ఏర్పాటైన ప్ర‌పంచ పెట్టుబ‌డిదారుల స‌ద‌స్సు స‌ద‌ర్భంగా త‌మిళ‌నాడు ప్రభుత్వం రూ.3.4 ల‌క్ష‌ల కోట్ల విలువైన ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందాల‌ను కుదుర్చుకుంది. ఆ ఒప్పందాల సంఖ్య 146.

రూ.2 ల‌క్ష‌ల కోట్ల విలువైన ఒప్పందాలు వ‌స్తాయ‌ని ఆశించిన‌ప్ప‌టికీ..అంచనాల‌కు మించిపోయింది. చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ రూ.7,400 కోట్లతో నాగ‌ప‌ట్టిణం జిల్లాలో పెట్రోలియం శుద్ధి క‌ర్మాగారాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ కోసం హ్యుండాయ్ సంస్థ మ‌రో రూ.7000 కోట్లు, వేలూరు జిల్లా పెరంబ‌లూరులో ఎమ్మార్ఎఫ్ టైర్ల త‌యారీ సంస్థ రూ.2,100 కోట్లతో విస్త‌ర‌ణ‌కు సంబంధించిన ఒప్పందాలు ఇందులో ఉన్నాయి.

జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, తైవాన్‌, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఫిన్లాండ్‌, అమెరికా, చైనా వంటి దేశాల‌కు చెందిన సంస్థ‌లు త‌మిళ‌నాడులో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకొచ్చాయి. ఈ సంద‌ర్భంగా ప‌ళ‌నిస్వామి మాట్లాడుతూ త‌మ రాష్ట్రం ఇప్ప‌టికే పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉంద‌ని, అదంతా దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ప్ర‌వేశపెట్టిన పారిశ్రామిక ప్రోత్సాహ‌క ప‌థ‌కాల వ‌ల్లే సాధ్య‌ప‌డింద‌ని చెప్పారు.

ఇక్క‌డో చిన్న విష‌యం- ప‌ళ‌నిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా పెట్టుబ‌డుల పేరుతో ఏ ఒక్క బ‌య‌టి దేశానికీ ఆయ‌న వెళ్ల‌నేలేదు. చైనా అని, జ‌పాన్ అని, సింగ‌పూర్ అని..ఎక్క‌డికీ ప్ర‌త్యేక విమానాల్లో చ‌క్క‌ర్లు కొట్ట‌లేదు.

ఏటా దావోస్ స‌ద‌స్సుకు హాజ‌రు కాలేదు. పెట్టుబ‌డుల కోసం అంటూ, సూటూ, బూటూ వేసుకున్న వారితో క‌లిసి ఫొటోల‌కు ఫోజులూ ఇవ్వ‌లేదు. ఇది ఎలా సాధ్య‌ప‌డింద‌నేది మ‌న ప్ర‌భుత్వ పెద్ద‌లు ఖ‌చ్చితంగా నేర్చుకుని తీరాల్సిన విష‌య‌మే.