ట్రేడ్ టాక్: ఈ వారం ఏది హిట్టు? …ఏది ఫట్టు?
ఈ వారం మూడు సినిమాలు తెలుగు సినిమా భాక్సాఫీస్ ని పలకరించాయి. పోస్టర్స్, ట్రైలర్స్, టీజర్స్ తో క్రేజ్ తెచ్చకుని ప్రేక్షకుల తీర్పు కోరుతూ బాక్సాఫీసు దగ్గర నిలబడ్డాయి. మరి వాటికి ఆడియన్స్ స్పందన ఎలా వచ్చింది? టాక్ ఆఫ్ ది వీక్‌గా నిలిచిన సినిమా ఏది?? అనేది చూద్దాం.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల నేపథ్యాన్ని మేళవిస్తూ, 1980ల నాటి వాతావరణాన్ని తెరపై ప్రతిబింబిస్తూ సాగిన చిత్రం ‘దొరసాని’. సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, రాజశేఖర్ కుమార్తె శివాత్మిక తొలిసారి నటించిన చిత్రమిది. ట్రైలర్, టీజర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి స్పందన రావడం, ఈమధ్య తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాల్ని అందుకోవడంతో – దొరసానిపై ఆశలు కలిగాయి. దాంతో… ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఈ చిత్రానికి బాక్సాఫీసు దగ్గర డివైడ్ టాక్ లభించింది. ‘సైరత్’ని తెలుగులో తీసినట్టుందని రివ్యూలలో విమర్శలు వచ్చాయి. ఇక తొలి రోజు వసూళ్లు బాగా డల్‌గా కనిపించాయి. రెండోరోజు కాస్త ఫరవాలేదనుకున్నా… ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
వరస ఫ్లాఫులతో దూసుకుపోతున్న సందీప్ కిషన్ నుంచి వచ్చిన సినిమా ‘నిను వీడని నీడను నేనే’. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాతో హిట్టు కొట్టి తీరాతాను.. అని సందీప్ ముందు నుంచీ చాలా నమ్మకంగా చెప్తూంటే…ఖచ్చితంగా సినిమాలో విషయం ఉందనే ఆశించాడు సగటు ప్రేక్షకుడు. స్టోరీ లైన్ విషయంలో దర్శక నిర్మాతలు కొత్తగా ఆలోచించినప్పటికీ, దాన్ని తెరపై తీసుకురావడంలో మాత్రం తడబడ్డారని చూసిన సగటు ప్రేక్షకుడు సైతం పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా యావరేజ్ అనుకున్నా కలెక్షన్స్ ఆ స్దాయిలో మాత్రం లేవు.
ఇక ఈ వారమే విడుదలైన మరో సినిమా `రాజ్‌దూత్` పరిస్థితి అయితే దారుణం. శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు సరైన పబ్లిసిటీ లేకపోవడంతో గుంపులో గోవిందంగా మిగిలిపోయింది. దాంతో ఈ చిత్రాన్ని అటు ప్రేక్షకులూ, ఇటు రివ్యూ రైటర్స్ సైతం పట్టించుకోలేదు. సినిమాలోనూ విషయం లేదని టాక్ వచ్చేసింది.
ఇక అందరి దృష్టీ వచ్చేవారం వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ పైనే ఉంది. తెలుగులో పక్కా మాస్, మసాలా సినిమా వచ్చి చాలా రోజులైంది. పైగా పూరి డైలాగులు, రామ్ హైపర్ నటన.. కలగలిసిన ఈ సినిమా ఏ మాత్రం బాగున్నా తిరుగుండదు.