తొమ్మిదో తరగతిలోనే నక్సలైట్, ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే

ఆమె చిన్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితురాలైంది. తుపాకి చేతపట్టింది. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అన్న నినాదాలకు ఆకర్షితురాలై సుదీర్ఘ కాలం ఉద్యమంలో పనిచేసింది. కానీ ఆ మార్గం సరికాదని బయటకొచ్చింది. తర్వాత అడ్వొకెట్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచింది. తర్వాత ఓడిపోయింది. తాజాగా 2018 తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచి సత్తా చాటింది. ఆమె ఎవరో కాదు ములుగు నియోజకవర్గ నాయకురాలు సీతక్క అలియాస్ దనసరి అనసూయ. ఆమె గురించి తెలుసుకుందాం.

ఉమ్మడి వరంగల్ (ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి) జిల్లాలో ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క ఈ ఎన్నికల్లో 18,423 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణలో టిఆర్ఎస్ కారు జోరు సాగుతున్న ఈ ముందస్తు ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో మాత్రం జనాలు సీతక్కను గెలిపించారు. సీతక్క మంత్రి చందూలాల్ ను మట్టి కరిపించారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టిడిపి తరుపున పోటీ చేసిన సీతక్క చందూలాల్ మీద ఓడిపోయారు. కానీ ఈసారి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 

సీతక్క మాజీ నక్సలైట్. కోయ సామాజికవర్గానికి చెందిన  ఆమె బాల్యంలోనే మావోయిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. 1987 లో 9వ తరగతి చదువుతున్నప్పుడే చదువు ఆపేసి జనశక్తి నక్సల్స్ గ్రూపులో చేరిపోయారు. ఏడేళ్లపాటు సుదీర్ఘంగా నక్సల్ పార్టీలో పనిచేశారు. 14 ఏళ్ల చిరు ప్రాయంలోనే తుపాకి చేతబట్టిన సీతక్క అడవి బాట పట్టారు. రెండేళ్లలోనే దళ కమాండర్ గా ఎన్నికయ్యారు.  ఏడేళ్ల పాటు అన్నల పార్టీలో పనిచేసిన తర్వాత 1994లో జన జీవన శ్రవంతిలో కలిశారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన తర్వాత ఆమె ఉన్నత చదువులు చదివారు. న్యాయ విద్య పూర్తి చేసి వరంగల్ సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేశారు. ఆ సమయంలో బాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు 2004లో వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా మాజీ నక్సలైట్ అయిన సీతక్కకు సీటు ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో సీతక్క ఓటమిపాలయ్యారు.

కానీ తర్వాత 2009లో సీతక్కకు మళ్లీ ములుగు సీటు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు గెలిచారు సీతక్క. అప్పటి నుంచి పదేళ్ల పాటు టిడిపిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ తెలంగాణవాదం బలంగా ఉండడంతో ఆమె ఓడిపోయారు. తెలంగాణలో టిడిపి రోజురోజుకూ అంతరించిపోతున్నవేళ సీతక్క ఆ పార్టీని వీడక తప్పలేదు.

గత ఏడాది కిందట సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డితోపాటు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో సీతక్క కాంగ్రెస్ గూటికి చేరారు. ఈసారి ములుగు సీటు సీతక్కకే కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఈ ఎన్నికల్లో మంత్రి చందూలాల్ ను ఓడించి తెలంగాణ అసెంబ్లీలో కాలు పెట్టారు సీతక్క. తనను ఓడించిన చందూలాల్ ను తిరిగి ఓడించారు సీతక్క.

ఉద్యమ సమయంలో తీవ్ర వత్తిళ్లు…

సీతక్క ప్రజాస్వామ్య రాజకీయాల్లో లైఫ్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మాజీ నక్సలైట్ గా ఉన్న ఆమె లా ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఓటు రాజకీయాల్లోకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది టిడిపి. రెండోసారి ఆమె ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే రెండుసార్లు టికెట్ ఇచ్చిందన విశ్వాసమో లేదంటే టిడిపితోనే ఉండాలన్న ఉద్దేశమో కానీ ఆమె టిడిపి వీడేందుకు ససేమిరా అన్నారు. తెలంగాణలో కొమ్ములు తిరిగిన నేతలుగా ఉన్నవారంతా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని తెలంగాణ వచ్చిన తర్వాత క్యూ కట్టి మరీ టిఆర్ఎస్ లో చేరారు.

 

ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ టిడిపి నేతలపై తెలంగాణవాదుల నుంచి తీవ్రమైన వత్తిడి ఉండేది. సీతక్కను సైతం తీవ్రంగా వత్తిడి చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, టిడిపిని వీడాలని వత్తిడి చేసినా ఆమె భయపడలేదు. రాజకీయ జీవితాన్నిచ్చిన టిడిపిలోనే కొనసాగుతానని ఆమె అక్కడే ఉండిపోయారు. ఆమెను టిఆర్ఎస్ లోకి తీసుకెళ్లేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు శక్తివంచన లేకుండా ప్రయత్నించి విఫలమయ్యారు.

తెలంగాణలో కేసిఆర్ ఫ్యామిలీలో సభ్యురాలిగా పనిచేసేందుకు సీతక్కకు మనసు రాలేదు. అందుకే ఎంత వత్తిడి వచ్చినా ఆమె మాత్రం టిఆర్ఎస్ లో చేరలేదు. తుదకు టిడిపి మరింత బలహీనమైతున్నవేళ అడుగుబొడుగు ఉన్న నాయకులంతా కాంగ్రెస్ గూటికి చేరారు. టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకోవడంతో సీతక్క కూడా ఆయన బాటలో నడిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో గెలిచారు. 

ఆసక్తికరమన విషయం ఏమంటే? రేవంత్ రెడ్డి నాయకత్వంలో టిడిపి ని వీడి టిఆర్ఎస్ లో చేరిన వారికి చాలామందికి టికెట్లు రాలేదు. కొందరికి వచ్చాయి. అలా టికెట్ దక్కించుకున్నవారిలో ఇద్దరు గిరిజన మహిళా నేతలు గెలుపొందారు. వారిలో ఒకరు సీతక్క కాగా మరొకరు ఇల్లెందులో గెలిచిన హరిప్రియా నాయక్. వీరిద్దరూ గెలిచారు కానీ రేవంత్ రెడ్డి ఓటమి చెందారు. రేవంత్ వర్గంగా ఉన్నవారిలో పెద్దపల్లి రమణారావు, మేడిపల్లి సత్యం లాంటివాళ్లు సయితం ఓటమి చెందారు.