అన్న పర్మిషన్ తో తన పార్టీ విషయం లో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం

వైఎస్ షర్మిల తెలంగాణ లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించిన తర్వాత మరింత దూకుడు పెంచారు. పార్టీ ఏర్పాటుపై ఆమె చకాచకా అడుగులు ముందుకు వేస్తున్నారు. మంగళవారం లోటస్ పాండ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమై చర్చించిన షర్మిల.. జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 20న ఆమె ఖమ్మంకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మంలో గతంలో వైసీపీ బలంగా ఉండేది. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీతో పాటు మూడు అసెంబ్లీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.

అందుకే మొదటగా వైఎస్ షర్మిల … ఖమ్మం జిల్లాపైనే ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. కొత్త పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్ లో విశాలమైన భవనాన్ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఏప్రిల్ 10న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. షర్మిల కూడా ఏప్రిల్ 10నే కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. వైఎస్ సెంటిమెంట్ గా భావించిన చేవెళ్లలోనే వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఆ రోజునే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ రోజున పార్టీ కనుక ప్రకటించకుంటే, అదే రోజున చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. వచ్చే ఏప్రిల్ పదో తేదీతో వైఎస్ పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తవుతాయి.

ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన కార్యక్రమానికి ఆ రోజున ముహూర్తం పెట్టుకున్నారని చెబుతున్నారు. ఈ లోపు పార్టీ జెండా, విధివిధానాలను ఖరారు చేయాలని వైఎస్ షర్మిల ముందుకు వెళుతున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల పార్టీపై రాజకీయ కాక కంటిన్యూ అవుతోంది. షర్మిల పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల నేతలు. కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల అని రేవంత్ రెడ్డి చెప్పగా.. అమిత్ షా డైరెక్షన్ లోనే కేసీఆర్, జగన్ వదిలిన బాణమే షర్మిల అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. అంతేకాదు తెలంగాణను రాజకీయ డ్రామాకు వేదికగా చేశారని ఆయన మండిపడ్డారు.