ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే పుల్ బిజీ అయిన మళయాళి కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్. బీకామ్ చదువుతున్న 18 ఏళ్ల కేరళ కుట్టి ప్రియ ప్రకాష్ వారియర్ ఆ మధ్యన సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఫేస్బుక్.. ట్విట్టర్.. వాట్సాప్.. ఎక్కడ చూసినా ప్రియ వీడియోలో హల్చల్ చేసాయి. తెలుగులోనూ ఆమెకు వీరాభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. కేరళ
త్రిసూర్‌కు చెందిన ప్రియ ‘ఒరు ఆధార్ లవ్’ సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఆ మధ్యన కేవలం 27 సెకన్ల ఈ చిత్రానికి సంభందించిన వీడియోని వదిలితే యావత్ భారతదేశం ఊగిపోయింది. ఆ క్రేజ్ ని బేస్ చేసుకుని ..ఇప్పుడా చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ ని తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో సుఖీభవ సినిమాస్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.
తెలుగు నిర్మాతలు ఎ. గురురాజ్, సి.హెచ్.వినోద్‌రెడ్డి మాట్లాడుతూ ‘ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ‘ఒరు ఆధార్ లవ్’ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయక్కర్లేదు. ప్రియా చేసిన ఒక్క కంటి సైగతో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ అంత గొప్పది. ఆ చిత్రం తెలుగు హక్కుల కోసం చాలా మంది ప్రయత్నించారు. భారీ పోటీ మధ్య హక్కులను మేం దక్కించుకున్నాం. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే అనే పేరుతో విడుదల చేస్తున్నాం’ అన్నారు.