మోహన్ లాల్ హీరోగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘ఒడియన్’ . శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ పవర్స్ కలిగిన యోధుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ అభిమానులంతా చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
ఈ నేపధ్యంలో అభిమానులంతా కలిసి .. కేరళలోని త్రిసూర్ జిల్లాలో గల ‘రాగం’ థియేటర్ ప్రాంగణంలో 130 అడుగుల మోహన్ లాల్ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అక్కడ ఇంత ఎత్తైన కటౌట్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావటంతో మీడియాలో హైలెట్ వార్తగా మారింది.
ఈ విషయం ప్రక్కన పెడితే తెలుగులోనూ ఈ చిత్రం భారీగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం తెలుగు హక్కులు దక్కించుకున్న దగ్గుపాటి క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఆఫర్ కి బిజినెస్ చేయటం విశేషం. తెలుగులో రామ్ దగ్గుపాటి, సంపత్ కుమార్ లు తెలుగు నిర్మాతలు. అయితే ఈ సినిమా టైటిల్ వింతగా ఉండటం, పబ్లిసిటీ పెద్దగా లేకపోవటం సినిమాకు ఏ మేరకు కలిసివస్తుందనేది వేచి చూడాల్సిన అంశం.
మోహన్‌లాల్ మళయాళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఆయనకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆయన నటించిన పలు మలయాళ చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన నటించిన ‘మనమంతా’, ‘కనుపాప’, ‘మన్యంపులి’ తదితర సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మన్యంపులి మంచి లాభాలను ఆర్జించి పెట్టింది. దాంతో ఆయన సినిమాలకు ఇక్కడా మంచి బిజనెస్ చేస్తున్నారు. తెలుగుని టార్గెట్ చేస్తూ ట్రైలర్, టీజర్స్ విడుదల చేస్తున్నారు.