దేశంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజాల్లో టాప్-3లో ఉండే పేరు ఆయనది. లక్షలాది మందికి లక్షల్లో వేతనాలు అందిస్తున్న సంస్థను నెలకొల్పిన ఘనత ఆయనది. సాఫ్ట్‌వేర్ రంగంలో మనదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినది కూడా ఆయనే. `ఇన్ఫోసిస్` నారాయణ మూర్తి.
తన సంస్థ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నారాయణ మూర్తి జీవితంపై బాలీవుడ్‌లో ఓ బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది ఈ మూవీ. స్క్రిప్ట్ సిద్ధమైన తరువాత నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులను వెల్లడిస్తారు. టాప్ ఫిల్మ్ మేకర్ సంజయ్ త్రిపాఠి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు కథను కూడా ఆయనే సమకూరుస్తున్నారు. ఇన్ఫోసిస్ సంస్థను అంతర్జాతీయ మార్కెట్‌లో ఓ బ్రాండ్‌గా తీర్చిదిద్దడం వెనుక నారాయణ మూర్తి చేసిన కృషి చాలా ఉంది. కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర జిల్లాకు చెందిన ఆయన ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో చదువుకున్నారు. 1981 జులైలో పుణేలో ఓ స్టార్టప్‌గా ఇన్ఫోసిస్‌కు పునాది వేశారు.
ఇప్పుడా సంస్థ ఏ స్థాయికి చేరుకున్నదో మనకు తెలిసిందే. 1981 నుంచి 2002 వరకూ ఆయనే ఆ సంస్థకు ఛైర్మన్. తాను పదవీ విరమణ చేసి విశాల్ సిక్కాను సంస్థ ఛైర్మన్‌గా నియమించారు. ఆ తరువాత సంస్థ నష్టాల బాట పట్టడంతో.. 2013లో మరోసారి నారాయణ మూర్తి ఛైర్మన్ పగ్గాలను అందుకున్నారు. నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు.
ఆ విశేషాలన్నింటినీ ప్రస్తావిస్తూ సంజయ్ త్రిపాఠి ఈ బయోపిక్ చిత్రీకరించనున్నారు. ఎనిమిది నెలల క్రితమే నారాయణ మూర్తి కలిసిన సంజయ్ త్రిపాఠి ఆయనను అతికష్టమ్మీద ఈ బయోపిక్‌కి ఒప్పించారట. నారాయణ మూర్తి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది.