తమిళం నుంచో, కన్నడ నుంచో లేక హిందీ నుంచి ఓ హిట్ సినిమా కొనుక్కుని తెచ్చుకుని రీమేక్ చేయటం మన తెలుగులో జరుగుతూంటుంది. అయితే మన తెలుగు చిత్రాలు అరుదుగా రీమేక్ లుగా ఇతర భాషల్లోకి వెళ్తున్నాయి. ముఖ్యంగా రీమేక్ చేయటానికి పెద్ద హీరోల సినిమాలనే ఎంచుకుంటుంటారు. కానీ ఇప్పుడో చిన్న సినిమా తమిళంలోకి రీమేక్ అవటం, పెద్ద సినిమాల నిర్మాతలకు షాక్ ఇచ్చింది.
తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ మంచు, దినేష్ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మించిన ఈ సినిమా క్రిందటి నెల 14న విడుదలైంది. చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా పెద్ద హిట్ గా టర్న్ తీసుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ సినిమా తమిళంలోకి రీమేక్ అవుతోంది.
గతంలో తేనవత్తు చిత్రం డైరక్ట్ చేసిన వివి కతిర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. జె. ఫణీంధ్ర కుమార్ ఈ సినిమాని తమ కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
‘‘హుషారు’చూసిన యూత్ సినిమాని సపోర్ట్ చేద్దామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, మీడియా మంచి సపోర్ట్ ఇవ్వడంతో పాటు పాజిటివ్ రివ్యూలు రావడం వల్లే ఈ సినిమా ఇంత మంచి హిట్ అయింది. ఈ సినిమా విడుదలైన రోజు కంటే తరువాతి రోజు నుంచి వసూళ్లు పెరగడం జరిగింది. ఇదంతా కేవలం ప్రేక్షకుల మౌత్ టాక్‌తోనే సాధ్యమైంది.