ఎవరికి ఎవరు పోటీ : `యాత్ర` వెర్సస్ ‘నేనే ముఖ్యమంత్రి’

మాజీ ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన `యాత్ర` చిత్రం ఈ వారంలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాద యాత్ర ఘట్టాలతో పాటు ప్రజల కష్టాల్ని హ్యూమన్ ఎమోషన్స్ ని అద్భుతంగా ఆవిష్కరించామని ఇప్పటికే దర్శకుడు మహి.వి.రాఘవ్ తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైయస్సార్ పాత్రలో నటించిన ఈ చిత్రం రిలీజ్ రోజే ‘నేనే ముఖ్యమంత్రి’టైటిల్ తో మరో చిత్రం విడుదల అవుతోంది.

వైయస్ జగన్ పై సెటైర్ గా రూపొందించారని చెప్పబడుతున్న ఈ చిత్రం …యాత్రతో పాటే రిలీజ్ అవుతూండటంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వాస్తవానికి యాత్ర సినిమాకే అంత గొప్ప బజ్ ఏమీ క్రియేట్ కాలేదు. ‘నేనే ముఖ్యమంత్రి’ చిత్రానికి అదే పరిస్దితి. అయితే వైయస్ అభిమానులు …పార్టీ వాళ్లు ఈ సినిమాకు మహా రాజ పోషకులు కావాలి. అయితే అదంతా సినిమా హిట్ అయితేనే జరుగుతుంది. లేకుండా అంత సీన్ లేదని ప్రక్కన పెట్టేస్తారు. ఎన్టీఆర్ ..కథానాయకుడు సినిమాది అదే పరిస్దితి. పార్టీవాళ్లు, బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ సినిమాని మోయలేకపోయారు.

ఇక ‘నేనే ముఖ్యమంత్రి’చిత్రానికి ప్రేక్షకులు ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా వైయస్ ని వ్యతిరేకించే వర్గమే ఉండాలి. సీనియర్ దర్శకుడు దేవీ ప్రసాద్ వాయు తనయ్ శశి ముఖ్య పాత్రల్లో మోహన్ రావిపాటి దర్శకత్వంలో `నేనే ముఖ్యమంత్రి` అనే చిత్రం తెరకెక్కింది. వైష్ణవి ఫిలింస్ ఆలూరి క్రియేషన్స్ పతాకాలపై అట్లూరి నారాయణరావు ఆలూరి సాంబశివరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తిగా వైయస్ జగన్ కి వ్యతిరేకంగా ఉంటుందంటూ ఒకటే ప్రచారం సాగుతోంది.

అయితే నిర్మాతలు మాత్రం ..ఈ చిత్రం ద్వారా సమకాలీన రాజకీయ అంశాల గురించి చర్చించాం. అన్నివర్గాలకు నచ్చే అంశాలతోపాటు అందర్నీ ఆలోచింపజేసేలా సన్నివేశాలు సంభాషణలు ఉంటాయని చెబుతున్నారు. నేటి సమాజిక రాజకీయ పరిస్థితులకు అద్దంపడుతూ ఈ చిత్రాన్ని నిర్మించామని అంటున్నారు. ఏ సినిమా జనాల్లోకి వెళ్తుందో..యాత్ర ఇంపాక్ట్ ఎంతవరకూ ఉంటుందో…నేనే ముఖ్యమంత్రి ని ఏ మేరకు ఆదరిస్తారో…చూడాలి.