వేసవిలో మన దేశంలో పెద్ద సినీ పండగే జరుగుతూంటుంది. ఎందుకంటే పిల్లలకు వేసవి శెలవులు ఇస్తారు. కాలేజీలు క్లోజ్ చేసేస్తారు. చాలా గవర్నమెంట్ ఆఫీస్ లు కూడా శెలవలు ఉంటాయి. ఈ క్రమంలో జనం ఎంటర్ట్నెంట్ వైపు మొగ్గు చూపుతారు. దాంతో దర్శక,నిర్మాతలు అంతా సమ్మర్ కు తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు. తెలుగులోనూ అదే పరిస్దితి. సంక్రాంతి వెళ్లిపోయాక మళ్లీ సమ్మర్ కే సినిమాల రిలీజ్ లు ఊపందుకుంటాయి. పెద్ద సినిమాలన్నీ వరసపెడతాయి.
ఈ నెల వచ్చే నెల (ఏప్రియల్) మొత్తం వరుసగా చిన్న సినిమాలు.. పెద్ద సినిమాల అనే తేడా లేకుండా బాక్సాఫీస్ సందడి సందడిగా మారబోతుంది. అప్పటికి ఓవైపు ఎలక్షన్లు, మరోపక్క ఐపిఎల్ సీజన్ ఉన్నాకూడా మరోవైపు మన దర్శక నిర్మాతలు తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ఈ సీజన్ మొదలు కానుంది.
మార్చి 22న రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఈ బాక్సాఫీస్ యుద్ధం మొదలు కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5న నాగచైతన్య సమంత వివాహం తర్వాత తొలిసారి నటించిన మజిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 12న సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
ఇక ఏప్రిల్ 19న నాని నటిస్తున్న జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఏప్రిల్ 25న తేజ బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సీతా సినిమా విడుదల కానుంది. ఇలా ఏప్రిల్ లో వరుసగా ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్నాయి.
ఇదే సమయంలో ఎలక్షన్స్ కూడా ఉండటంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇక దర్శక నిర్మాతలు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా కనిపిస్తున్నారు. మే 9న మహర్షి సినిమా విడుదల కావడంతో ఈ భారీ సినిమా సీజన్కు తెర పడనుంది.
ఇక ఈ వారం ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినా కూడా వాటిలో ఏదీ భాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోయింది. ధియోటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి.