విజయ్ దేవరకొండని ‘బయోపిక్’ లోకి లాగేసారే

ఇప్పుడు తెలుగు,హిందీ పరిశ్రమలో ఎక్కడ చూసినా బయోపిక్ ల వార్తలే. పేరున్న స్టార్ హీరోలందరూ బయోపిక్ చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సైతం తాజాగా ఓ బయోపిక్ కమిటైనట్లు సమాచారం. విజయ్ కు తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. దాంతో విజయ్ త్వరలోనే బాలీవుడ్ లో నటించే అవకాశం ఉందనే వార్తలు గతకొంతకాలం నుంచి విన్పిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో కాలుపెట్టే టైం వచ్చేసిందని సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్… ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ బయోపిక్ కు “83” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కపిల్ దేవ్ పాత్రకోసం రణ్వీర్ సింగ్ ను తీసుకున్నారు. ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం.

ప్రముఖ్ క్రికెటర్, కపిల్ దేవ్ స్నేహితుడు కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ పాత్ర కథకు కీలకమని, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్టును ఒప్పుకునే అవకాశముందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 2020లో ఈ సినిమా విడుదలవుతుంది.