ఆ చెత్త సినిమాకి రూ.200 కోట్ల కలక్షనా? డైరక్ట్ గా అనేసాడు

కొన్ని లెక్కలు కొందరిని కంగారుపెడతాయి…ఆవేదనను కలిగిస్తాయి. ఇప్పుడు అదే పరిస్దితి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు , దర్శకుడు అయిన తిగ్మాంషు ధులియా కు కలిగినట్లుంది. ఆయన .. అజయ్‌ దేవగణ్‌ నటించిన ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రంపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై రూ.200 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

ఈ విషయంపై ధులియా బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా పట్ల ప్రేక్షకులకు ఉన్న టేస్ట్ మారుతోంది. గతంలో మేం ఏదన్నా సినిమా తీస్తే అది అందరికీ కనెక్ట్‌ అయ్యేది. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు కొన్ని రకాల మనుషులకే నచ్చుతున్నాయి. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రేక్షకుల ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది’

‘దాదా కోండ్కే అనే దర్శకుడు ఒకరు ఉన్నారు. ఆయన మంచి దర్శకుడు. ఆయన సినిమాలన్నీ కేవలం దిగువ తరగతి ప్రేక్షకులకే నచ్చేవి. ఓ గౌరవనీయ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరూ ఆయన సినిమాలు చూసేవారు కాదు. కానీ ఇటీవల విడుదలైన ‘టోటల్‌ ధమాల్‌’ చిత్రాన్ని ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు.

ఈ సినిమా ట్రైలర్‌లో చెత్త తప్ప ఏమీ లేదు. అలాంటి చెత్త సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. నాకు నచ్చిన సినిమాలను తెరకెక్కించలేకపోతున్నానన్నదే నా బాధ. విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఉంది. కంటెంట్‌లో మార్పులు వస్తున్నప్పటికీ సినిమాలో హీరో, హీరోయిన్‌, స్నేహితుల పాత్రలు ఉండి తీరాల్సిన పరిస్థితి ఇంకా ఉంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పాన్‌ సింగ్‌ తోమర్‌’, ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వస్సేపూర్‌’, ‘సాహెబ్‌ బీవీ ఔర్‌ గ్యాంగ్‌స్టర్‌’ వంటి చిత్రాలకు తిగ్మాంషు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘మిలాన్‌ టాకీస్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.