బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో నిందితుడుగా ఉండి అరెస్టైన ఆదిత్య పంచోలీ తనయుడు సూరజ్ పంచోలీ బెయిల్ పై అప్పుడే బయిటకు వచ్చారు. కానీ ఇప్పటివరకూ కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి ఆ కేసు హియరింగ్ కు వచ్చినప్పుడల్లా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం సూరజ్ పంచోలిని ఓ హంతకుడిగానే చిత్రీకరిస్తూంటాయి.
అయితే నేరస్దుడు అని తేలకుండా కేవలం నేరారోపణతో ఇలా మీడియా మాట్లాడటం సూరజ్ కు బాధ కలిగిస్తోంది. మరో ప్రక్క ఆయన కెరీర్ కూడా ముందుకు వెళ్లకుండా ఈ వివాద సుడిగుండంలో ఇరుక్కుపోయింది. దాంతో తన పుట్టిన రోజు అయిన ఈ రోజున తన మనస్సులో బాధను సోషల్ మీడియా వేదికగా వెల్లగక్కారు. జియా ఖాన్ గురించి ప్రస్తావిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ లో ఏమి రాసి ఉందంటే..
‘ఈరోజుతో నా జీవితంలో 28 ఏళ్లు పూర్తిచేసుకున్నాను. ఈ సందర్భంగా ఎంతో కాలంగా నా మనసులోని ఆలోచనలు, అభిప్రాయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. జియా ఖాన్ కేసు తేలే వరకు నేను నోరు విప్పకూడదని అనుకున్నా. కానీ ఈ కేసు సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతూనే ఉంది. నాకు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీడంలేదు. ఎన్నో భావోద్వేగాలతో కూడిన ఫీలింగ్స్ గురించి బయటపెట్టడం చాలా కష్టం. మొదట నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
గత ఆరేళ్లుగా నేను కేసు నిమిత్తం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఈ క్రమంలో నన్ను హంతకుడు, నేరస్తుడు అంటూ దారుణమైన మాటలు అన్నారు. దాదాపు రోజూ నా గురించి వార్తా పత్రికల్లో వస్తున్న ఈ మాటలను నేను చదువుతూనే ఉన్నాను. కానీ నా మనసెప్పుడూ నన్ను ధైర్యంగా ఉండమనే చెప్పింది. కానీ నాకు కావాల్సిన వారు మాత్రం ఈ విషయంలో చాలా బాధపడ్డారు. మీరంతా వార్తాపత్రికల్లో చదివినట్లు నేను రాక్షసుడిని కాను. నా గురించి ఇలా అనుకుంటున్నందుకు నేను ప్రజలను ఏమీ అనను. ఎందుకంటే వారికి నిజం తెలీదు.
నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. దాంతో నన్ను నేను నిరూపించుకునే అవకాశం నాకు దొరకలేదు. జీవితంలో నాకున్న ఒకే ఒక్క కల, కోరిక..నా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడం. ఓ మంచి కొడుకులాగే ఎదుగుతూ వచ్చాను. ఇకనుంచైనా నా కుటుంబం అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కేసు ఓ కొలిక్కి వచ్చి నేను నిర్దోషిగా బయటపడతానని ఆశిస్తున్నాను.’ అని వెల్లడించాడు సూరజ్.