మీటూ ఉద్యమం వచ్చిన నాటి నుంచి చాలా మంది హీరోయిన్స్ తమ క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలను బహిరంగంగా చెప్పగలగుతున్నారు. తాజాగా ప్రముఖ మరాఠీ నటి శ్రుతి మరాఠే.. దక్షిణాది పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంఘటనను ఎదుర్కొన్నానని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ద్వారా బయటపెట్టారు.
శ్రుతి మాట్లాడుతూ..‘నేను 16 ఏళ్ల వయసు నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నా. తెర వెనుక నన్ను ఎందరో అవమానించారు. నటీనటుల జీవితాలు చాలా హాయిగా సాగిపోతుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నా కెరీర్ తొలినాళ్లలో ఓ దక్షిణాది సినిమాలో నటించే అవకాశం వచ్చింది. సినిమా కోసం దర్శకుడు బికినీ వేసుకోవాలన్నాడు. ఎందుకు? ఏమిటి? లాంటి ప్రశ్నలు వేయకుండా సినిమా కోసం ఒప్పుకొన్నా. కొన్నేళ్ల తర్వాత మరాఠీ షోలతో నాకు బాగా పాపులారిటీ వచ్చింది. కానీ నేను నటించిన దక్షిణాది సినిమాలో ఆ సన్నివేశం చూసిన కొందరు ఎగతాళి చేశారు’ అన్నారు.
అలాగే.. ‘ఆ మాటలు మన ఆత్మవిశ్వాసాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో మీకు తెలుసా? అయినా నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోయాను. ఓసారి సినిమాలో అవకాశం ఇస్తానని ఓ నిర్మాత నన్ను కలిశాడు. మొదట్లో ప్రొఫెషనల్‌గానే మాట్లాడాడు. ఆ తర్వాత నాతో సన్నిహితంగా ఉంటావా అని తన అసలు స్వరూపం బయటపెట్టాడు. అప్పుడు నేను ‘మరి హీరోను కూడా ఇలాగే అడిగావా?’ అని అడిగేశాను.
నా ప్రశ్న విని అతడు షాకయ్యాడు. ఆ రోజు భయంలేకుండా అతడిని నిలదీయడానికి నాకు ఒక నిమిషమే పట్టింది. నాకోసం నేను నిలబడలేదు. ప్రతీ ఆడపిల్లను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రశ్న అడిగాను. నేను వేసుకునే దుస్తులు నా వ్యక్తిత్వాన్ని తెలియజేయవు. నా ప్రతిభ, కష్టపడే తత్వం, నా విజయం మాత్రమే నేనేంటో చెబుతాయి’ అని పేర్కొన్నారు.
ఇతరులతో నేరుగా పంచుకోలేని ఇలాంటి అంశాలను ఈ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేస్తుంటారు. ‘బుధియా సింగ్: బార్న్ టు రన్’ చిత్రంతో శ్రుతి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.