నందమూరి తారక రామారావు జీవితం చివరి రోజుల్లో పడిన బాధలు, ఆయనకు జరిగిన అన్యాయం, ఆయనపై చేసిన కుట్ర తదితర అంశాల వెనుక దాగి ఉన్న నిజాలను చూపించే సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చేస్తున్నామంటూ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా రీసెంట్ గా తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే చంద్రబాబు పాత్రకు నటుడుని సోషల్ మీడియా ద్వారా పట్టుకుని ఎంపిక చేసారు. అలాగే ఎన్టీఆర్ కోసం కూడా నటుడు అన్వేషణ జరుగుతోంది.
మరో ప్రక్క ఎన్టీఆర్ …ద్వితీయ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రలో మోడల్ రుపాలి సూరిని వర్మ ఎంపికచేశారని వార్తలు వస్తున్నాయి. ముంబయికి చెందిన రుపాలి ‘డ్యాడ్, హోల్డ్ మై హ్యాండ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి, రుపాలి కలిసి కొన్ని రోజులు జర్నీ చేస్తారని, లక్ష్మీ పార్వతి పాత్ర గురించి చర్చించనున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. సతీశ్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక చోటుచేసుకున్న సంఘటనలను ఈ చిత్రంలో వర్మ చూపించటానికి సిద్దపడుతున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ… ఎన్టీఆర్ జీవితంలో సినిమా, రాజకీయం, లక్ష్మీపార్వతితో వివాహానంతర పరిణామాలు, ఆయన వ్యక్తిత్వం తదితర అంశాలను స్పృశిస్తూ సినిమా సాగుతుందని చెప్పారు. ఎవరో చెప్పినట్టు.. ఎవరో విన్నట్టు కాకుండా ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన అన్ని ఘట్టాల గురించి వారి ఇంటిలోని పనివారి దగ్గర్నుంచి రాజకీయ నాయకుల వరకు అందరి నుంచి సేకరించిన నిజాలను తెరపైకి తెస్తున్నట్లు వివరించారు వర్మ.