అమ్మ జయలలిత రూపం కోసం క్వీన్ అగచాట్లు
అమ్మ జయలలితపై ఒకేసారి రెండు బయోపిక్ లు సెట్స్ పైకి వెళుతుండడం ఇండియా లెవల్లోనే హాట్ టాపిక్. నిత్యామీనన్ కథానాయికగా `ది ఐరన్ లేడి` సెట్స్‌కెళుతుండగానే.. క్వీన్ కంగన రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న `తలైవి` (జయ) చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే క్వీన్ కంగనకు లుక్ టెస్టులు మొదలయ్యాయి. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ప్రముఖ హాలీవుడ్ మేకప్ మేన్ కొలిన్స్ సాయంతో క్వీన్ తన రూపాన్ని చెక్ చేసుకుంటోంది. అమ్మ ఆహార్యం తనకు ఆపాదించే ప్రక్రియ సీరియస్‌గా సాగుతోంది.
కంగన అమెరికా లాస్ ఏంజెల్స్ కి వెళ్లిందని ఇటీవలే వార్తలొచ్చాయి. ఆ క్రమంలోనే వెంటనే పని ప్రారంభమైంది. ప్రస్తుతం లుక్ టెస్టుల కోసం రకరకాల ప్రయోగాలు మొదలయ్యాయి. అమ్మ జయలలిత లుక్ ఎలా వుండాలి? తనలా కనిపించాలంటే ఏం చేయాలి? అన్నదానిపై తీవ్రంగానే కసరత్తు చేస్తున్నారని తాజాగా రివీలైన ఫోటోలు చెబుతున్నాయి. కెప్టెన్ మార్వెల్, బ్లేడ్ రన్నర్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన స్పెషలిస్ట్ మేకప్‌మేన్ జాసన్ కొలిన్స్ పర్యవేక్షణలో ఈ పరీక్ష సాగుతోంది. తెలుపు, పచ్చ, బులుగు ఇలా రకరకాల రంగులతో రసాయన మిశ్రమాల్ని తయారు చేసి కంగన ఒంటికి అద్దుతున్న ఫోటోలు చూస్తుంటేనే వామ్మోవ్ అనిపిస్తోంది. అయితే ఈ మేకప్ కోసం గంటల కొద్దీ సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విషయంలో క్వీన్ కంగన ఓపికను మెచ్చుకుని తీరాల్సింది.
ఉలగనాయగన్ కమల్ హాసన్.. చియాన్ విక్రమ్ తరహాలోనే ప్రోస్థటిక్ తో ఈ అమ్మడి ప్రయోగాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కమిట్ మెంట్ వల్లనే బాలీవుడ్ లో ఈ బ్యూటీ రియల్ క్వీన్ గా వెలిగిపోతోంది. ఇప్పటికే తమిళం తో పాటు భరతనాట్యం నేర్చుకుంటోంది. అమ్మ జయలలితను మరిపించేలా నటనకు పక్కాగా ప్రిపేరవుతోంది. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు నిర్మాతలు విష్ణు ఇందూరి -ఆర్. సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ సహా పలువురు తారాగణం నటించనున్నారని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ తో పాటు కాస్టింగ్ సెలక్షన్ జరుగుతోంది.