“మీటూ”పై వర్మ షాకింగ్ కామెంట్..వివాదం కోసమా?

మీటూ.. కొన్ని నెలలుగా సినిమా రంగంతోపాటు వివిధ రంగాలను కుదిపేస్తున్న ఉద్యమం. తమపై గతంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి పలువురు మహిళలు బయటపెడుతున్నారు. ఈ ఉద్యమం ఏ స్దాయికి వెళ్లిందంటే.. ఏకంగా ఓ కేంద్ర మంత్రిని తన పదవి కోల్పోయేలా చేసింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలకు సమాజం తన వంతు సానుభూతి చూపిస్తూ వస్తోంది.

బాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా ఉదృతంగా సాగుతోంది మీటూ ఉద్యమం. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది నటీమణులు గళం విప్పారు. వివాదాలు ప్రారంభమయ్యాయి. మీడియా సైతం ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసింది. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీటూ ఉద్యమంపై కామెంట్స్ చేశారు. తన తాజా చిత్రం భైరవగీత ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ”మీటూలో అంతా నా పేరు ఉంటుందని అనుకున్నారు. నా గురించి ఒక్క హీరోయిన్ కూడా మాట్లాడకపోవడం బాలీవుడ్ వాళ్లని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. పొద్దున్న లేస్తే అమ్మాయిల గురించి మాట్లాడుతుంటా … అందుకే వాళ్లెవరూ నా పేరు బయటకి తీసుకురాలేదేమో.. ఇక మీటూ ఉద్యమం ద్వారా ఏం సాదిస్తున్నారనేది పక్కన పెడితే, చిత్రసీమలో ఇలాంటి సమస్య ఉందనే విషయం ప్రజలకు అర్ధమవుతుంది. తాము ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడడానికి ఓ వేదిక దొరికినట్లు అవుతుంది. అయితే ఇలాంటి ఉద్యమాల వల్ల సమస్యలు ఆగుతాయని నాకు అనిపించడం లేదు” అని పేర్కొన్నారు.