దాదాపు 17 సంవత్సరాల క్రిందటి వివాదం ఇప్పుడు మళ్లీ సమస్య గా మారుతుందని ఎవరు ఊహిస్తారు. ఇంకా అప్పటి విషయం గుర్తుపెట్టుకుంటారని ఎవరూ అనుకోరు. కానీ బాలీవుడ్ బాద్షా ..యస్..వివాదాలు ఎన్ని ఏళ్లైనా జనం మర్చిపోరు అని అనుకోవాల్సిన పరిస్దితి వచ్చింది. ఒడిశాకు చెందిన కళింగ సేన షారుక్ ఖాన్‌ను బెదిరించింది. షారూఖ్ ముఖానికి సిరా పూస్తామని హెచ్చరికలు జారి చేసింది.
నవంబరు 27న భువనేశ్వర్‌లో హాకీ మెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. దీని ఓపినింగ్ పోగ్రామ్ కు షారుక్ హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తమ రాష్ట్రానికి రావడం పట్ల కళింగ సేన జనరల్ సెక్రటరీ నిహార్ మండిపడ్డారు.
నిహాల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘షారుక్ విమానాశ్రయం నుంచి స్టేడియంకు వెళ్లేలోపు ఆయన ముఖంపై సిరా చల్లి.. నలుపు రంగు జెండాను చూపించాలని మేం ప్లాన్ చేశాం. మా కార్యకర్తలు షారుక్ వెళ్లాల్సిన మార్గంలో అడుగడుగునా ఉంటారు’ అని చెప్పారు. అయితే షారుక్‌తోపాటు వస్తున్న అందరు వీఐపీలకు తగిన భద్రత ఏర్పాటు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
అప్పటి వివాదం ఏమిటి..
17 ఏళ్ల క్రితం అంటే… 2001లో షారుక్ నటించిన చిత్రం ‘అశోక’. ఇందులో ఆయన రాజు అశోక పాత్రను పోషించారు. దీంతో ఒడిశాకు చెందిన కళింగ సేన అప్పట్లో షారుక్‌కు వ్యతిరేకంగా పిటిషన్ కూడా వేసింది. సినిమాలో తమ సంస్కృతిని తప్పుగా చూపించారని ఆరోపించింది.
‘అశోక’ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు వ్యతిరేకంగా ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు షారుక్ భువనేశ్వర్‌కు రానున్న నేపథ్యంలో నవంబరు 11న ఆయన దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ఒడిశాను, ఇక్కడి ప్రజల్ని అవమానించినందుకు షారుక్ క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కళింగ సేన చీఫ్ హేమంత్ డిమాండ్ చేశారు.