బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఎన్ని వివాదాలకు తావిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నెపోటిజంపై ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. అవకాశాలు ఇవ్వకుండానే ఆ స్థాయికి చేరుకున్నాడా? అని కొందరంటే..తన చావుకు కారణం బంధుప్రీతి అంటూ గట్టిగా చెప్పిన వర్గం అంతకు మించి ఎక్కువగా ఉంది. బాలీవుడ్ లో ఇలాంటి ఆత్మహత్యలు కొత్తేం కాదు. గతంలో పలువురు హీరోయిన్లు, సినీ వారసత్వం ఉన్న తనయులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ సుషాంత్ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగి సూసైడ్ చేసుకోవడంతోనే ఇన్ని అనుమానాలకు తావిచ్చినట్లు అయింది.
తాజాగా నెపోటిజం అనే వాదనకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్ రెహమాన్ మద్దతిచ్చారు. అక్కడ తనని కొంత మంది తొక్కే ప్రయత్నం చేసేవారని, చెడుగా చెప్పేవారని రెహమాన్ అన్నారు. దీని వెనుక ఓ పెద్ద గ్యాంగ్ ఉందన్నారు. మంచి సినిమాలకు ఎప్పుడూ నో చెప్పను. కానీ అక్కడ ఆ గ్యాంగ్ అదే పనిగా నెగిటివ్ గా చిత్రీకరించే పని పెట్టుకుని ఉంటుందని..ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ తర్వాత పరిస్థితులు అన్నింటిన తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలిపారు. `దిల్ బేచారా` దర్శకుడు ముఖేష్ ఛాబ్రా తన దగ్గరకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నాలుగు పాటలు చేసిచ్చాను.
ఆసమయంలో ఛాబ్రా తనతో చాలా మంది మీ రెహమాన్ వద్దకు వెళ్లొద్దని ఏవేవో స్టోరీలు చెప్పేవారని తెలిపారు. అప్పుడే హిందీలో తక్కువ సినిమాలు చేస్తున్నాను అన్న విషయాన్ని గ్రహించానన్నారు. పెద్ద సినిమాలు కూడా ఎందుకు రాలేదో అప్పుడే తనకు అర్ధమైందని రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రెహమాన్ లాంటి దిగ్గజాన్నే ఇబ్బంది పెట్టారంటే? అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం రెహమాన్ హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డికి ముందుగానే రెహమాన్ నే ఖరారు చేసారు. కానీ ఆయన తప్పుకున్నారు. ఆ కారణం ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీనే. ఈ నేపథ్యంలో అప్పట్లో రెహమాన్ పై టాలీవుడ్ మీడియాలో వ్యతిరేక కథనాలు వెలు వడ్డాయి.రెహమాన్ ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కుని కోలీవుడ్ లో బ్రాండ్ అయ్యారు. ఆ తర్వాతే బాలీవుడ్ కి వెళ్లారు. కానీ ఆయనకు అక్కడా ఇబ్బందులు తప్పలేదు.