షారుక్‌ చేతిలో కత్తి పై వివాదం, హైకోర్ట్ లో కేసు

బాలీవుడ్‌ మెగాస్టార్ షారుక్‌ ఖాన్‌పై ముంబయి హైకోర్టులో కేసు నమోదైంది. రీసెంట్ గా షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా ‘జీరో’చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. మరుగుజ్జు అయిన షారుక్ ఓ అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆరాటపడుతూ కనిపించటం చాలా మందికి నచ్చింది. అయితే అదే ట్రైలర్ లో చూపిన చిన్న షాట్ ఇప్పుడు ఆయనపైనా,దర్శకుడుపైనా కేసు వేసేలా చేసింది. ఇంతకీ ఏమిటా షాట్ అంటే…

‘జీరో’ట్రైలర్‌లోని ఓ సీన్ లో షారుక్‌ మెడలో కరెన్సీ నోట్ల దండ వేసుకుని, చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తారు. ఆ సమయంలో షారుక్‌ చేతిలోని ఆ కత్తి సిక్కులకు ఎంతో పవిత్రమైనదని, ఆయన సిక్కుల మతపరమైన భావాల్ని కించపరిచారని అమృత్‌పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి కేసు వేశారు. ఆ సీన్ ని సినిమా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

‘‘జీరో’ సినిమాలో షారుక్‌ మేం ధరించే కత్తి (కిర్పాన్‌)తో కనిపించారు. మా నమ్మకాన్ని, సంప్రదాయాల్ని కించపరిచారు. దానితో కామిడీ చేయాలని చూశారు. సంప్రదాయం ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే కిర్పాన్‌ ధరించే, తీసుకెళ్లే ప్రత్యేక హక్కు ఉంది. షారుక్‌ ఈ నిబంధనను వదిలేసారు.

బ్రిటిష్‌లు భారత్‌ను పాలించే సమయంలో కిర్పాన్‌ కోసం చాలా మంది సిక్కులు ప్రాణత్యాగం చేశారు. అలాంటి దానిపై జోక్‌లు వేయడం సరికాదు. మరొకరు కిర్పాన్‌ ధరించకూడదని నేను చెప్పడం లేదు. షారుక్‌ దాన్ని ధరించొచ్చు.. కానీ అది పద్ధతి ప్రకారం జరగాలి’ అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే షారుక్‌ చేతిలో ఉన్నది పంజాబ్‌లో వాడే సంప్రదాయ కత్తి కాదని, సాధారణం వాడే పదునైన ఆయుధమని చిత్ర యూనిట్ అంటోంది.

షారూఖ్ హీరోగా నటించిన చిత్రం ‘జీరో’. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ హీరోయిన్. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడు. డిసెంబరు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.