ఐశ్వర్య ట్వీట్ దుమారం, క్షమాపణ చెప్పనంటూ హీరో

నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ ట్వీట్ ను డిలీట్‌ చేయాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర బండార్కర్‌ కోరారు. అయితే వివేక్ ఒబరాయ్ తను క్షమాపణ చెప్పాల్సినంత తప్పేమీ చెయ్యలేదు అన్నారు. అలాగే అది కేవలం నవ్వుకోవటానికే అయినా దాన్ని ఎందుకంత ఇష్యూ చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు ఆ మెమో లో ఉన్న వాళ్లకే సమస్య లేనప్పుడు మీకెందుకు అన్నారు. ఆ మెమో లో ఉన్న ఐశ్వర్యారాయ్ ఇప్పటివరకూ స్పందించలేదు.

అసలేం జరిగిందంటే..

ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో వివేక్ ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ఐష్‌- సల్మాన్‌, వివేక్‌, అభిషేక్‌లతో కలిసి ఉన్నారు. సల్మాన్‌-ఐష్‌ ఉన్న ఫొటోపై ‘ఒపీనియన్‌ పోల్‌’ అని, ఐష్‌-వివేక్‌ ఫొటోపై ‘ఎగ్జిట్‌ పోల్‌‌’ అని, ఐష్‌-అభిషేక్‌ ఉన్న ఫొటోపై ‘ఫలితాలు’ అని రాసుంది. దీనికి వివేక్‌ క్యాప్షన్‌గా.. ‘హ హ.. క్రియేటివ్‌.. ఇది రాజకీయం కాదు. కేవలం జీవితం’ అని రాశారు.

దీంతో ఈ విషయం కాస్త వివాదం అయ్యింది. ఆయన తీరుపై ఇప్పటికే నటి సోనమ్‌ కపూర్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాలాతోపాటు పలువురు ప్రముఖులు మండిపడ్డారు. తాజాగా దర్శకుడు మధుర బండార్కర్‌ స్పందించారు. ‘ప్రియమైన వివేక్‌ ఒబెరాయ్‌.. నీ నుంచి ఇలాంటి ట్వీట్‌ను ఎప్పుడూ ఊహించలేదు.

విమర్శకులు ఎంతకైనా తెగించి, ఎలాంటి మీమ్స్‌ అయినా చేస్తారు. కానీ బాధ్యతగల ఓ సెలబ్రిటీ అయిన మీరు మరొకరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించాలి. దయచేసి క్షమించమని కోరి, ట్వీట్‌ను డిలీట్‌ చేయండి’ అని ట్వీట్‌ చేశారు. మరోపక్క జాతీయ మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు పంపింది. ఎగ్జిట్‌ పోల్స్‌ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్‌కు వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది.