ముందు బీజేపీ వెనక జగన్.. కేసీఆర్ ఎలా బయటపడతారో  

తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఏ పనైనా చేయాలి అనుకుంటే ఎవరు ఎదురొచ్చినా డోంట్ కేర్ అనే తత్వం ఆయనది.  ఆ దూకుడే ప్రజల ద్రుష్టిలో ఆయన్ను హీరోను చేసింది, నీటి ప్రాజెక్టుల విషయంలో అపర భగీరథుడిగా నిలబెట్టింది.  కానీ ఇప్పుడు ఆ దూకుడే తగ్గిందా అనేలా ఉంది పరిస్థితి.  ప్రస్తుతం ఏపీ, తెలంగాణల నడుమ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ విషయంలో పెద్ద రగడే నడుస్తోంది.  ప్రాజెక్ట్ కడతామని వైఎస్ జగన్ జీవో 203ని రిలీజ్ చేయడంతో కేసీఆర్ ఆగ్రహించారు.  ఆయనతో సహా తెరాస నేతలంతా ఏపీ సర్కార్ ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామని సవాల్ చేశారు. 
 
ఈ అంశం మీద కేసీఆర్ సమగ్ర చర్చలు కూడా జరిపారు.  ఆయన ఊపు చూసి వైఎస్ జగన్ కు గట్టి కౌంటర్ పడటం ఖాయమని తెలంగాణ ప్రజానీకం అనుకుంది.  కానీ నేతలు మాట్లాడుతున్నారు తప్ప వైఎస్ జగన్ జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకునేలా ఏ చర్యా తీసుకోలేదు.  ఇంతలో ఇదే రైట్ టైమ్ అనుకున్న భాజాపా రంగంలోకి దిగింది.  పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ సర్కారుకు బ్రేకులు వేసే భాద్యత మొత్తం తమదే అన్నట్టు మాట్లాడారు భాజాపా నేతలు.  మొదట్లో అంతా దీన్ని లైట్ తీసుకున్నారు.  కానీ భాజాపా నేత బండి సంజయ్ కుమార్ అనూహ్య రీతిలో పావులు కదిపారు. 
 
ఆయన నేరుగా కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఏపీ చేపడుతున్న ప్రాజెక్ట్ సరైనది కాదని, దీని వలన తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని లేఖ రాశారు.  సత్వరమే స్పందించిన కేంద్ర మంత్రి జీవో 203 పై స్టే ఇస్తూ ఉత్తర్వులు పాస్ చేశారు.  దీంతో భాజాపా రొమ్ము విరుచుకుని కేసీఆర్ చేయలేని పని తాము చేసి చూపించామని అన్నారు.  జనం సైతం కేసీఆర్ దెబ్బ కొడతారని అనుకుంటే బీజేపీ సత్తా చూపిందే అనుకున్నారు.  సరే పోనీ ఇక మీదటి వ్యవహారం తామే నడుపుదామని గులాబీ నేతలు భావిస్తే వైఎస్ జగన్ షాకిచ్చే ట్విస్ట్ ఒకటి పెట్టినట్టు తెలుస్తోంది.  
 
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తాము ఆపాలంటే తమకు నష్టం చేకూర్చేలా ఉన్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ వెనక్కి తీసుకోవాలనే వాదనను జగన్ తెరపైకి తెచ్చే యోచనలో ఉన్నారట.  పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు.  ఆ ప్రాజెక్టును ఆపడమంటే చిన్న విషయం కాదు.  ఇప్పటికే ఆ ప్రాజెక్టును 2 టీఎంసీల ఎస్టిమేషన్ నుండి ఒక టీఎంసీకి తగ్గించారని కేసీఆర్ మీద ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. 
 
తెలంగాణ దక్షిణ ప్రాంతంలో కేసీఆర్ ఇమేజ్ నిలబడాలంటే ఈ ప్రాజెక్టును ఆయన పూర్తిచేసి తీరాలి.  అలాంటిది ఏపీ సర్కార్ అపమనే ప్రతిపాదన తీసుకొస్తే కేసీఆర్ ఏం చేస్తారనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది.  భాజాపా సైతం కేసీఆర్ డెసిషన్ తెలంగాణ ప్రజల అబీష్టానికి అనుకూలంగా లేకపోతే విరుచుకుపడటానికి సిద్దం ఉంది.  మరి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేలా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితిని కేసీఆర్ ఎలా అధిగమిస్తారో చూడాలి.