జీవితంలో ఎదో సాధించాలనే లక్ష్యంతో చాలా బయలుదేరిన తరువాత .. కొద్దీ మంది మాత్రం తీరా గమ్యం చేరాక తాను నడచి వచ్చిన దారిని .. తాను పడ్డ కష్టాలను .. అనుభవించిన కన్నీళ్లను మర్చిపోతారు. తమ కోసమే అహర్నిశలు కష్టపడుతూ …. సర్వ సుఖాలు అనుభవిస్తూ .. బయటి ప్రపంచాన్ని పట్టించుకోరు . కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడరు . కానీ అలాంటి వారి కోవకు చెందని యంగ్ హీరో విజయ్ దేవరకొండ . విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి హీరో కాలేదు .. స్టార్ డమ్ రాలేదు . సినిమా రంగంలో తన కల ను సాకారం చేసుకోవడానికి అనేక కస్టాలు పడ్డాడు .ఓపిగ్గా భవిష్యత్తు కోసం ఎదురు చూశాడు .
నిజానికి విజయ్ 2011లోనే సినిమా రంగంలోకి “నువ్విలా ” అనే సినిమాతో ప్రవేశించాడు . రవిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రామోజీరావు నిర్మించారు . ఈ సినిమా విజయ్ కు గుర్తింపు తీసుకురాలేదు .2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ “లో నటించాడు. ఈ సినిమా కూడా విజయ్ లోని నటుడును ప్రపంచానికి చూపించలేకపోయింది . 2015లో నటించిన “ఎవడె సుబ్రహ్మణ్యం ” చిత్రం విజయ్ కు కొంత గుర్తింపు తీసుకొచ్చింది . అయినా హీరోగా నిర్మాతల దృష్టిలో కి రాలేదు . 2016లో తరుణ్ భాస్కర్ దర్శత్వంలో “పెళ్లిచూపులు ” సినిమా చేశాడు . ఇది చిన్న సినిమా .. ఎవరికీ ఈ సినిమా గురించి పెద్ద అంచనాలు లేవు. కానీ విడుదలైన తరువాత అనూహ్యమైన విజయం సాధించింది . దీనికి తోడు క్రిటిక్స్ ప్రశంసలు … జాతీయ అవార్డు .. విజయ్ సినిమా జీవితాన్ని మలుపు తిప్పాయి .2 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 27 కోట్ల రూపాయలను సంపాదించి పెట్టింది.
ఇక 2017లో”అర్జున్ రెడ్డి ” విజయ్ కు స్టార్ డమ్ తీసుకొచ్చింది . సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా 4. 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల రూపాయలను వసులు చేసి సినిమా రంగాన్ని ఆశ్చర్యపరిచింది . నిర్మాతల చూపు విజయ్ మీద పడింది . అల్లు అరవింద్ విజయ్ లోని స్టామినా గుర్తించాడు . వెంటనే అతని కాల్ షీట్స్ సంపాదించాడు 2018లో అల్లుఅరవింద్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందించిన “గీతగోవిందమ్ ” సినిమా ను 5 కోట్లతో నిర్మించారు . ఈ సినిమా 130 కోట్లను సంపాదించి విజయ్ కు స్టార్ హోదా తెచ్చి పెట్టింది .
ఇప్పుడు విజయ్ దేవరకొండ డిమాండు వున్న హీరో .తెలుగు సినిమా రంగంలో విజయ్ ఓ ప్రత్యేకత సంపాదించారు . దిన దిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నారు . అయినా విజయ్ సమాజం పట్ల తన భాద్యతను మర్చిపోలేదు . “ది దేవరకొండ ఫౌండేషన్ ” పేరుతో ఓ ట్రస్టు ను నెలకొల్పాడు . దీని ద్వారా నిరోద్యోగుల కు సహాయపడాలనే ఆశయంతో దీనిని ప్రారంభించాడు . కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది . లాక్ డౌన్ కారంముగా ఎంతో మంది నిరుపేదలు , వలస కూలీలు ఆకలికి అలమటిస్తోంటే విజయ్ తన ట్రస్టు ద్వారా చేయూతనిస్తున్నాడు . వారి ఆకలి బాధ తీరుస్తున్నాడు .
కరోనా సమయంలో తన ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం చెయ్యడం ఆయన మానవతా దృక్పథాన్ని తెలియజేస్తుంది . విజయ్ స్టార్ డమ్ వచ్చినా .. ఆ గ్లామర్ ప్రపంచంలో ఉండిపోకుండా సమాజం పట్ల తన భాద్యతను గుర్తు పెట్టుకోవం , సాటి మనుషులకు సహాయ పడటం .. నిజంగా అభినందించతగ్గ విషయం . నేను జాతీయ సినిమా అవార్డుల కమిటీ సభ్యుడుగా వున్నప్పుడు విజయ్ నటించిన “పెళ్లి చూపులు ” సినిమాను ఎంపిక చెయ్యడం జరిగింది . 2016లో నిర్మాణమైన ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా జాతీయ అవార్డు గెలుచుకుంది . విజయ్ దేవరకొండ కు తెలుగు రాజ్యం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ … ఇలాంటి పుట్టిన రోజు పండుగలు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటుంది.
– భగీరథ