చెర్వుగట్టు జాతరలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అవమానం (వీడియో)

 నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి జాతరలో అవమానం జరిగింది. ఎమ్మెల్యే వాహన కాన్వాయ్ ని గుట్టపైకి అనుమతివ్వకపోవడంతో దానికి నిరసనగా ఆయన గుట్టపైకి కాలినడకన చేరారు. మంగళవారం ఉదయం చెర్వుగట్టు రామలింగేశ్వర  స్వామి దర్శనానికి ఆయన వచ్చారు. ఆయనతో పాటు పలువురు ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, సర్పంచ్ లు కలిసి 6 వాహానాల్లో వచ్చారు. అయితే ఈ సంవత్సరం విఐపి వాహానాలకు కూడా కింది వరకే పార్కింగ్ అనుమతించారు. గుట్ట పైకి ఇవ్వలేదు.

ఎమ్మెల్యే ఎంపీలు తమ వాహనం మాత్రమే తీసుకెళ్లాలి. దీంతో చిరుమర్తి లింగయ్య తన వాహన శ్రేణి మొత్తాన్ని అనుమతించాలని కోరాడు. దానికి పోలీసులు అంగీకరించలేదు. దీంతో చేసేదేం లేక వాహనాలను కిందనే పెట్టి లింగయ్య కాలినడకన గుట్టపైకి వెళ్లారు. అంతకు ముందు చెక్ పోస్టు వద్ద చిరుమర్తి లింగయ్య కారును పోలీసు సిబ్బంది ఆపారు. అసలు అతను ఎమ్మెల్యేనేనా కాదా అని తెలుసుకునేందుకు డ్యూటిలో ఉన్న ఎస్ ఐ సీఐకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని పంపించాడు. నల్లగొండ జిల్లా పోలీసులు కనీసం ఎమ్మెల్యేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.

ఎమ్మెల్యే గుట్ట మీదికి వస్తున్నాడంటే ఆలయ అధికారులు ప్రొటో కాల్ ప్రకారం ఆహ్వానం పలకాలి. కానీ అటువంటివి ఏం చేయకపోవడంతో ఎమ్మెల్యే తన కార్యకర్తలతో దర్శనం చేసుకొని వెనుదిరిగారు. ఎమ్మెల్యే వెళ్లిపోతున్న సమయంలో ఈవో వచ్చి కార్యాలయానికి రావాలని కోరగా ఎమ్మెల్యే సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు.  జాతర ప్రారంభకులుగా ఉన్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రాలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం జాతరను ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించని అధికారుల పై ఫిర్యాదు చేస్తామని వారిని వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు చెర్వుగట్టులో జరిగిన అవమానాన్ని వారు ఖండించారు.