తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టులో ఈ క్షేత్రం ఉంది. నేటి నుంచి 8 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు నల్లగొండ జిల్లా కేంద్రంలో జరగనున్న నగరోత్సవంతో అంకురార్పన చేయనున్నారు. ఈ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ స్వామివారి కళ్యాణోత్సవం రోజు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. సీఎం టూర్ ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రత కొనసాగనుంది. అన్ని డిపోల నుంచి చెర్వుగట్టుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం దేవస్థానం వారు ప్రత్యేక ధరలను నిర్ణయించారు. ధరల కంటే ఎక్కువ రుసుం తీసుకుంటే తమకు ఫిర్యాదు చేయాలని దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల కోసం 2 లక్షల ప్రత్యేక లడ్డూలను సిద్దం చేశారు.