కోమటి రెడ్డి బ్రదర్స్ కు మరో షాక్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారి అనుంగు అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఆ తదుపరి నార్కెట్ పల్లి జడ్. పి.టి.సి గా ఎన్నికయ్యారు.రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి కూడా సుదీర్ఘ కాలం స్వగ్రామం నెమ్మాని గ్రామ సర్పంచ్ గా వ్యవరించారు.

అలుగుబెల్లి రవీందర్ రెడ్డి

నల్గొండ నియోజకవర్గ పరిధిలో నార్కెట్ పల్లి, చిట్యాల మండలాలు కలిసి ఉన్నప్పుడు దివంగత నేత చకిలం శ్రీనివాసరావు అనుచరులుగా వ్యవరించిన రవీందర్ రెడ్డి కుటుంబం ఆయన తదనంతరం కొంత కాలం స్థబ్దతగా ఉన్నారు.1998 ప్రాంతంలో అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డికి నియోజకవర్గ పరిధిలో అంతంత మాత్రంగా పరిచయాలు ఉండడంతో అలుగుబెల్లి అన్నీ తానై ఆయన సాధించిన వరుస విజయాలలో కీలక పాత్ర పోషించారు.

ఆ తరువాత 2009 కాలంలో రాజకీయ అరంగ్రేటం చేసిన కోమటిరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి లోకసభ కు పోటీ చేసినప్పుడు కూడా అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ముందుండి పాత కాపులను కొత్త కాపులను ఒక్క తాటి మీదకు తెచ్చి ఆయన విజయం లోను ముఖ్య భూమిక పోషించారు.

ఈ క్రమంలోనే ఆయన టి ఆర్ యస్ శ్రేణులకు చేరువ కావడం నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం తో సాన్నిహిత్యం ఉండడం జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి తో సంబంధాలు ఉండడంతో ఆయన టి ఆర్ యస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో వారం రోజుల్లో నల్గొండలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జరుగుతున్న నేపధ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత అలుగుబెల్లి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టి ఆర్ యస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది.

బుధవారం మధ్యాహ్నాం 3 గంటలకు తెలంగాణా భవన్ లో మంత్రులు కేటీఆర్ ,జగదీష్ రెడ్డి ల సమక్షంలో అలుగుబెల్లి రవిందర్ రెడ్డి టి ఆర్ యస్ లో చేరనున్నారు. ఈ నేపద్యంలో ఆయన అనుచరులు భారీ ఎత్తున తెలంగాణ భవన్ కు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులకు, కోమటిరెడ్డి వర్గానికి ఇది పెద్ద షాక్ అని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.