త్వరలో పరిపాలన రాజధాని కానున్న విశాఖపట్నం జిల్లా మొత్తం విజయసాయిరెడ్డి చేతుల్లోనే ఉంది. మొదటి నుండి వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర అందులోనూ విశాఖ జిల్లా మీద ఎక్కువ దృష్టి పెట్టారు. గతంలో ఇక్కడ ఎంపీగా పోటీచేసిన జగన్ తల్లి విజయమ్మ ఓటమిపాలయ్యారు. అప్పటి నుండి విశాఖలో పాగా వేయాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు అక్కడ పార్టీ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. విజయసాయిరెడ్డి సమర్థవంతంగా పనిచేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. గత ఎన్నికల్లో విశాఖతో కలిపి మూడు ఉత్తరాంధ్ర జిల్లాలోనూ టీడీపీకి దక్కింది ఆరు అసెంబ్లీ స్థానాలు, ఒకే ఒక్క ఎంపీ సీటు మాత్రమే. దీంతో ఫిదా అయిపోయిన జగన్ ఎన్నికల అనంతరం విశాఖ మొత్తాన్ని మడిచి విజయసాయి చేతిలో పెట్టేశారు.
అప్పటి నుండి పాలన విషయాలైనా, పార్టీ వ్యవహారాలైన విజయసాయిరెడ్డిదే నిర్ణయం. ప్రతి విషయంలోనూ ఆయనదే తుది నిర్ణయం. అది ఎలాంటిదైనా జగన్ ఆమోదించేవారు. త్వరలో పాలన రాజధాని కానున్నందున విజయసాయి లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద దృష్టి పెట్టారు. అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే నాయకులకు నచ్చలేదు. అసలు తమ మీద విజయసాయి పెత్తనం ఏమిటని మండిపడుతున్నారు. నేరుగా జగన్ వద్దకు పిర్యాదులు పంపుతున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు పార్టీ మారిపోవు విషయంలో కూడ విజయసాయి మీద అనేక ఆరోపణలు వచ్చాయి. జగన్ గంటాను ఆదరించాలని అనుకున్నా విజయసాయి అడ్డుపడ్డారనే మాట ఉంది.
ఇక చంద్రబాబు నాయుడు అయితే విశాఖ మీద పట్టును తిరిగి సంపాదించాలనే ఉద్దేశ్యంతో లోకల్ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే దూరమైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను కూడగట్టుకునే ప్రయత్న్మ్ చేసున్నారు. ఇటీవల ప్రకటించిన తెదేపా రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన 20 మంది నేతలకు స్థానం కల్పించారు. ఇది పార్టీ తిరిగి పుంజుకోవడానికి దోహదపడే అంశమే. ఈ పరిస్థితులన్నీ గమనించిన జగన్ పంచాయతీ ఎన్నికలను టార్గెట్ చేశారు. విశాఖ జిల్లాలో ఉన్న మైనార్టీ పంచాయతీలు మొత్తంగా వైకాపా ఖాయాలోనే పడాలని డిసైడ్ చేశారు. ఈమేరకు విజయసాయిరెడ్డికి లక్ష్యం పెట్టి మైనార్టీలు మొత్తం మళ్ళీ పార్టీకే జైకొట్టాలని, సంస్థాగతంగా టీడీపీ బలహీనపడిపోయేలా చేయాలని చెప్పారట. దీంతో విజయసాయి మీద పెద్ద కర్తవ్యమే పడింది. దీన్ని గనుక ఆయన విజయవంతం చేయలేకపోతే విశాఖ విజయసాయిరెడ్డి చేతుల్లో నుండి జారిపోయినట్టే.