జనసేన పార్టీ తరపున రాపాక వరప్రసాదరావు ఒక్కరే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన రాష్ట్రం మొత్తం పాపులర్ అయ్యారు. పార్టీ తరపున పవన్ కంటే ముందు అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారని జనసేనలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కానీ సీన్ మొత్తాన్ని నాలుగైదు నెలల్లోనే మార్చేశారు రాపాక. అసెంబ్లీలో మెల్లగా ప్రారంభించి జగన్ కు మద్దతివ్వడం స్టార్ట్ చేశారు. ఆయన పాలనకు భజన కార్యక్రమం షురూ చేశారు. ఆ భజన అసెంబ్లీ దాటి రాజోలు రోడ్ల మీదకు చేరింది. రాజోలులోని ప్రతి సెంటర్లో జగన్ బొమ్మలకు పాలాభిషేకాలు చేశారు ఆయన. ఇలా భజన చేస్తూనే నియోజకవర్గంలో అన్ని గ్రూపులను తన కిందకు తెచ్చుకునే పనులు స్టార్ట్ చేశారు.
రాజోలు వైసీపీలో మొదటి నుండి బొంతు రాజేశ్వరరావు, పెదపాటి అమ్మాజీలు కీలకంగా ఉంటున్నారు. అమ్మాజీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వైకాపా అభ్యర్థి ఓడిపోయినా పైన అధికారంలో ఉన్నది తన పార్టీనే కాబట్టో రాజోలులో అడ్డు ఉండదని వీరు భావించారు. కానీ రాపాక ప్లేటు ఫిరాయించి వీరికే పోటీగా మారారు. మెల్లగా అన్ని పనుల్లోనూ జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేశారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారాలని ట్రై చేస్తున్నారు. రాపాక పనులన్నిటినీ చూస్తున్న వైసీపీ వర్గాలు టైమ్ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు మౌనంగానే ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు రావడంతో వైసీపీ తరపున అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. లెక్కప్రకారం ఈ పనులను వైసీపీ నేతలే చేయాలి.
కానీ రాపాక లెక్కలు వేరు కదా. అందుకే ఆయనకు కోపం వచ్చింది. మలికిపురం మండలం చింతలమోరి సర్పంచ్ అభ్యర్థిని మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ తరఫు వ్యక్తికి కేటాయించారు. దీంతో తన ఊళ్ళో అభ్యర్థులను ఫైనల్ చేయడానికి మీరెవరు అంటూ వైసీపీ కార్యకర్తకు ఫోన్ చేసి మరీ తిట్ల దండకం అందుకున్నారు. అంతా నాదే మీరెవరు అన్నట్టు మాట్లాడారు. దీన్నిబట్టి రాజోలు వైసీపీని సింగిల్ హ్యాండ్ మీద ఏలాలనే రాపాక వ్యూహం స్పష్టంగా బయటపడింది. అధికార పార్టీకి అనుకూలమని ప్రకటించి ఇప్పుడు అదే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసిన రాపాక పట్ల వైసీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక రాజోలు వైసీపీ శ్రేణులైతే జనసేన నుండి వచ్చి మాకు మేకయ్యాడేంటి, మాలో మాకు ఈ గొడవలేంటి అనుకుంటున్నారు.